కన్నప్ప' చిత్రం మీద జరుగుతున్న దుష్ప్ర చారాన్ని ఆపండి
తెలుగు సినిమా ప్రేక్షకులకి, అన్ని కులాల వారికి, ముఖ్యంగా బ్రాహ్మణ మిత్రులందరికీ... నమస్సులు...!
గత కొద్ది కాలంగా విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన 'కన్నప్ప' చిత్రం మీద జరుగుతున్న దుష్ప్ర చారాన్ని చూసి సినిమాకి మాటల రచయితగా పనిచేసిన నా మనసుకి ఆవేదన కలిగి, కొన్ని విషయాలు మీతో చెప్పదల్చుకున్నాను. నా పేరు ఆకెళ్ళ శివప్రసాద్, బ్రాహ్మణుడిని. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ కూడా ఉత్తర భారత దేశానికి చెందిన బ్రాహ్మణులు. టీవీ సీరియల్గా మహాభారతాన్ని అత్యద్భుతంగా తీసిన దర్శకులు. ఈ చిత్రంలో బ్రాహ్మణులని గానీ, ఏ ఇతర కులాల వారిని గానీ కించపరచలేదు.
అలాగే ఇదివరకు కన్నప్ప చరిత్ర మీద వచ్చిన చిత్రాలలో కన్నడ కంఠీరవ రాజ కుమార్ నటించిన 'శ్రీ కాళహస్తి మహత్యం', శ్రీ కృష్ణంరాజు నటించిన 'భక్త కన్నప్ప' చిత్రాలలో గుడిలో ప్రధాన పూజారి మహదేవ శాస్త్రి పాత్రను (మొదటి చిత్రంలో లింగమూర్తి , రెండవ దాంట్లో రావు గోపాల రావు పోషించారు) గుడిలో దేవుడి నగలు తీసుకెళ్ళి తన ఉంపుడుగత్తెకు ఇచ్చినట్టుగా చూపించారు. కానీ కన్నప్ప చిత్రంలో కథానాయకుడిగా నటించడమే గాక, కథా రచన చేసిన విష్ణు మంచు ... ధూర్జటి 16వ శతాబ్దంలో రచించిన శ్రీ కాళహస్తి మహత్యం గ్రంథం ఆధారంగా, మోహన్ బాబు పోషించిన మహదేవ శాస్త్రి పాత్రని మహా శివ భక్తుడి పాత్రగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. రేపు సినిమా చూశాక, ప్రేక్షకులందరికీ ఆ విషయం అర్థమవుతుంది.మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా, చిత్రాన్ని పూర్తి చేశాక కూడా పరమ పవిత్రమైన శ్రీ కాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకి చూపించారు. వారు చిత్రం ఎంతో ఉన్నతంగా వుందని ప్రశంసించి, శ్రీ మోహన్ బాబు ని, విష్ణు ని వేదమంత్రాలతో ఆశీర్వదించారు.ఇక ఈ చిత్రంలో పాటని రాసిన శ్రీ రామజోగయ్య శాస్త్రి తో పాటు ఎందరో బ్రాహ్మణులు వివిధ శాఖలలో పనిచేసారు. ఇంకొక విషయం... ఏ వర్గం వారిని కించపరచడానికి, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి చిత్రాన్ని నిర్మించవలసిన అవసరం ఎవరికీ లేదు. చివరగా, కన్నప్ప చిత్రం ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు.