సహస్ర హత్య కేసులో బాలుడే హంతకుడు
సహస్ర హత్య కేసులో బాలుడే హంతకుడు
సహస్ర హత్య కేసులో బాలుడే హంతకుడు
దొంగతనానికి వచ్చి... ఎక్కడ చెబుతుందోనని హత్య చేసిన బాలుడు
15 నిమిషాల పాటు బాలుడు ఆ ఇంటినే చూస్తున్నట్లు సిసి కెమెరాలో నిక్షిప్తం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
సంచలనం సృష్టించిన పన్నెండేళ్ల చిన్నారి సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడింది. బాలిక ఉంటున్న అపార్ట్ మెంట్ పొరుగునే ఉంటున్న 10వ తరగతి విద్యార్థి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. దొంగతనానికి వెళ్లిన బాలుడు ఊహించని విధంగా సహస్ర ఇంట్లో ఉండటం...తనను చూడటంతో అందరికీ విషయం చెప్పేస్తుందని ఆమెను కిరాతకంగా హతమార్చినట్టుగా వెల్లడైంది. క్రికెట్ బ్యాట్ కొనటానికే డబ్బు దొంగిలించటానికే వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. కూకట్ పల్లి సంగీత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ లో నివాసముంటున్న సహస్ర అయిదు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్కూల్ కు వెళ్లిన కొడుక్కి లంచ్ బాక్స్ ఇద్దామని చిన్నారి తండ్రి కృష్ణ ఇంటికి వచ్చినపుడు ఈ ఘాతుకం వెలుగు చూసింది. కత్తితో గొంతు, కడుపులో ఇరవై సార్లకు పైగా పొడవటంతో రక్తం మడుగులో చనిపోయిన సహస్ర మృతదేహం కనిపించింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా అందరిలో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. నిందితున్ని పట్టుకునేందుకు బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్ అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు పదుల సంఖ్యలో అనుమానితులను విచారించాయి. సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే అద్దెకు ఉంటున్న ఒడిషాకు చెందిన వ్యక్తితోపాటు దాదాపు నలభై మందిని ప్రశ్నించాయి. అయితే, కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. *సహస్ర కుటుంబం అద్దెకుంటున్న అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాలు లేవు. అయితే, దాని ఎదురుగా ఉన్న ఓ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. వాటి ఫుటేజీని విశ్లేషించినపుడు సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి ఎవరు వెళుతున్నట్టుగానీ...బయటకు వస్తున్నట్టుగానీ కనిపించ లేదు. ఇక, అపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినపుడు కూడా హత్య జరిగిన సమయంలో అటుగా అనుమానాస్పదంగా ఎవరు వచ్చినట్టుగానీ...వెళ్లినట్టుగానీ అగుపించ లేదు. అయితే, సహస్ర ఉంటున్న అపార్ట్ మెంట్ గేటు వద్ద ఓ యువకుడు బయటకు తొంగి చూస్తున్న దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుగుపొరుగున ఉంటున్న వారిలోనే ఎవరో ఒకరు టెర్రస్ పైనుంచి వచ్చి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించటం మొదలు పెట్టారు.
దొంగతనానికి వచ్చి...నేనే చంపేశా...
ఈ క్రమంలోనే సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ పక్క బిల్డింగ్ లోని 10వ తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట తనకేమీ తెలియదని బాలుడు నమ్మించటానికి ప్రయత్నించినా పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేయటంతో తానే సహస్రను చంపినట్టుగా అంగీకరించాడు. నిజానికి తాను దొంగతనం చేయటానికి వెళ్లినట్టుగా చెప్పాడు. సహస్ర తనను చూడటంతో అందరికీ చెబుతుందన్న భయంతోనే ఈ నేరానికి పాల్పడినట్టుగా వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు అతని నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తం మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు దొంగతనం ఎలా చేయాలి? అన్నదానికి సంబంధించి ఆ బాలుడు రాసుకున్న కాగితాన్ని కూడా సీజ్ చేశారు.
మిషన్ don?
హత్యకు గురైన సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. ఆమె తమ్ముడు మరో ప్రైవేట్ స్కూల్ విద్యార్థి. తల్లి రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుండగా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. ప్రతీరోజు ఉదయం పిల్లలు స్కూళ్లకు వెళ్లగానే ఇంటికి తాళం వేసి రేణుక, కృష్ణలు తమ తమ పనులపై వెళ్లిపోయేవారు. పొరుగింట్లోనే ఉంటున్న బాలునికి ఈ విషయం బాగా తెలుసు. ఈ క్రమంలో కృష్ణ ఇంట్లో చోరీకి పథకం వేసుకున్నాడు. యూ ట్యూబ్ వీడియోలు చూసి తాళాన్ని ఎలా విరగ్గొట్టాలో తెలుసుకున్నాడు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ వివరాలను మిషన్ థెఫ్ట్ అంటూ పేపర్ పై రాసుకోవటం. హౌ టు ఎంట్రీ...హౌ టు బ్రేక్ హుండీ...హౌ టు ఎస్కేప్ అని రాసి చివరకు మిషన్ డన్ అని కూడా ఆ కాగితంపై రాశాడు. రూపొందించుకున్న పథకం ప్రకారం ఓ కత్తి, స్క్రూడ్రైవర్ వెంట తీసుకుని టెర్రస్ పైనుంచి సహస్ర కుటుంబం ఉంటున్న పెంట్ హౌస్ వద్దకు చేరుకున్నాడు. ఆ రోజు స్కూల్ కు సెలవు కావటంతో సహస్ర ఒంటరిగా ఇంట్లో ఉంది. చోరీ చేయటానికి లోపలికి వచ్చిన బాలున్ని చూసింది. దాంతో తన గురించి అందరికీ చెబుతుందని భయపడ్డ బాలుడు ఆమెపై దాడి చేశాడు. మొదట గొంతు నులిమి ఆ తరువాత కత్తితో గొంతుపై, కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. సహస్ర చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత దేవుని ఫోటోల వద్ద ఉన్న హుండీని పగులగొట్టి దొరికిన డబ్బు తస్కరించి టెర్రస్ పైనుంచే ఉడాయించాడు. ఆ రోజు సెలవు లేకుండా ఉంటే సహస్ర స్కూల్ కు వెళ్లేదని...ప్రాణాలతో బతికేదని స్థానికులు ఆవేదనతో వ్యాఖ్యానించారు. చూస్తుంటే మృత్యువు ఆ చిన్నారిని వెంటాడినట్టుగా అనిపిస్తోందన్నారు. ఇక, పోలీసులు బాలుని నుంచి దొంగతనం ఎలా చేయాలని రాసుకున్న లెటర్, రక్తం మరకలు ఉన్న దుస్తులు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. కేసులో మిస్టరీ వీడినట్టే అని చెప్పిన అధికారులు అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.