మూసీ నిర్వాసితులందరికి ప్రత్యామ్నాయం కల్పిస్తాం : రేవంత్ రెడ్డి
మూసీ నిర్వాసితులందరికి ప్రత్యామ్నాయం కల్పిస్తాం : రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు. గడ్డం వెంకటస్వామి (కాకా) 95 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. వెంకటస్వామి ని స్పూర్తిగా తీసుకుని నిరుపేదలందరికీ ఒక మంచి జీవితాన్ని, మంచి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు.హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నగరంలో 12 నుంచి 14 వందల ఫీట్ల లోతుల్లోకి బోరు వేస్తే తప్ప నీళ్లు పడే పరిస్థితి లేదని చెప్పారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకుని బతుకుతున్నారు. నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేతల సూచనలు కూడా తీసుకోవడానకి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ముఖ్యమంత్రి సూచించారు.ఆనాడు వెంకటస్వామి వేలాది మంది పేదలకు గూడు కల్పించారు. సింగరేణి మూతపడే దశకు చేరుకున్న దశలో దాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేశారు.మహనీయుడు వెంకటస్వామి ఆకాంక్షించినట్టు తమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఆదిలాబాద్ కు నీరందిస్తాం. అభివృద్ధిలో ఆదిలాబాద్ తో పాటు పెద్దపల్లి జిల్లాకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.ప్రజా ప్రభుత్వం కాకాను సమున్నతంగా గౌరవిస్తూ వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ , అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కేఆర్ నాగరాజు , మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ , సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.