ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన  రేవంత్ రెడ్డి
ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన  రేవంత్ రెడ్డి

మూడు దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న టోర్నమెంట్‌లో ఇండియాతో పాటు మారిషస్, సిరియా దేశాల జట్లు తలపడతాయి. ఇండియా, మారిషస్‌ల మధ్య తొలి మ్యాచ్ ఓపెనింగ్ సెర్మనీలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు.ఇండియా, సిరియా, మారిషస్ దేశాల జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ క్రీడాభిమానులు, ముఖ్యంగా హైదరాబాద్ ఫుట్‌బాల్ ప్రియుల తరఫున ఆటగాళ్లకు ముఖ్యమంత్రి  స్వాగతం పలికారు. హైదరాబాద్‌ను దేశ క్రీడా రాజధానిగా మార్చాలన్న తమ ప్రభుత్వ ప్రయత్నమని వివరించారు. టోర్నమెంట్‌ను ప్రారంభించిన అనంతరం అన్ని జట్ల ఆటగాళ్లకు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.మూడు జట్ల మధ్య మూడు మ్యాచులు (రౌండ్ రాబిన్ ఫార్మేట్) జరగనుండగా, సెప్టెంబర్ 6న మారిషస్ వర్సెస్ సిరియా, 9 వ తేదీన ఇండియా వర్సెస్ సిరియా జట్లు తలపడనున్నాయి. ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ , క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి , పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.