గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
ప్రజా క్షేత్ర్, ఢిల్లీ:
సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కోదండరాం, అలీఖాన్‌లు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ వీరి వాదనను తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి నియామకాలపై విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కోరారు. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేస్తూ.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.