సిరియా జట్టుకు "ఇంటర్ కాంటినెంటల్ కప్-2024" ను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
సిరియా జట్టుకు "ఇంటర్ కాంటినెంటల్ కప్-2024" ను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేతలైన సిరియా ఆటగాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మంగళవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరియా విజయం సాధించింది. దీంతో సిరియా ఈ ఎడిషన్ విన్నర్‌గా నిలవగా, ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి ఆ జట్టుకు "ఇంటర్ కాంటినెంటల్ కప్-2024" ను అందజేశారు. మూడు దేశాలు మధ్య మూడు మ్యాచులు (రౌండ్ రాబిన్ ఫార్మేట్) జరిగిన ఈ ఫుట్‌బాల్ టోర్నీని ఈ నెల 3 న ప్రారంభించిన ముఖ్యమంత్రి నేటి ముగింపు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను, నిర్వహకులను అభినందించారు. ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం హైదరాబాద్‌కు కల్పించినందుకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ను దేశ క్రీడా రాజధానిగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమని సీఎం పునరుద్ఘాటించారు. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించారంటూ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తో పాటు ఇతర ముఖ్యులకు సీఎం అభినందనలు తెలియజేశారు. ఈ ముగింపు వేడుకల్లో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ , ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఏ హరిస్ , సెక్రటరీ జనరల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.