హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం : సీ ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం : సీ ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం : సీ ఎం రేవంత్ రెడ్డి

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా.. మూడు ప్రాంతాలుగా విభజించి రాష్ట్రం సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించడానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9 వ తేదీలోపు విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరి సహకారం ఉండాలని విజ్ఞప్తి చేశారు. గచ్చీబౌలి కూడలిలో ఆరు లేన్లతో నిర్మించిన దివంగత పి. జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణను మూడు ప్రాంతాలుగా.. ఓఆర్ఆర్ లోపలి భాగంలో కోర్ అర్బన్‌గా, ఓఆర్ఆర్ అవతలి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ-అర్బన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు అవతలి భాగంలో గ్రామీణ ప్రాంతంగా విభజించి, ప్రాంతాల వారిగా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధితో ముందుకు వెళతాం.  ఓఆర్‌ఆర్‌ ఆవలివైపున 30 వేల ఎకరాల్లో ప్రపంచ శ్రేణి భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించాం. ఇందులో క్రీడలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, నాన్-పొల్యూటెడ్ ఫార్మా రంగాలను అభివృద్ధి పరుస్తాం. ఫ్యూచర్ సిటీలో పచ్చదనం కోసం దాదాపు 15 వేల ఎకరాల్లో పార్కులను, మిగతా ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.వాయు కాలుష్యంతో ఢిల్లీ, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు, వర్షాలొస్తే వరదలతో చెన్నై నగరాలు  అతలాకుతమవుతున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో పనిచేస్తున్నాం.  నగరంలో కాలుష్యం నివారించాలన్న లక్ష్యంతోనే ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ పన్నులను పూర్తిగా రద్దు చేశాం. జంట నగరాల్లో తిరుగుతున్న 3 వేల ఆర్టీసీ బస్సులను ఓఆర్ఆర్ బయటి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో వచ్చే ఏడాది లోపు 3 వేల ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాం.  కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అనేక విధాలుగా పనిచేస్తున్నాం. నాలాలు, చెరువులు కబ్జాలు చేశారు. నీరుండాల్సిన చోట అపార్ట్‌మెంట్లు వెలువడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. అందుకే నాలాలు, చెరువుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాం.  దీన్ని కొందరు రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలి. ఆ మధ్య కాలంలో ఎన్-కన్వెన్షన్ కూల్చివేసిన సందర్భంగా సినీనటుడు నాగార్జున గారు స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి చెరువును అభివృద్ధి పరచడంలో తాను సహకరిస్తామని చెప్పారు. ఎన్నో వివాదాలు సృష్టించినప్పటికీ కబ్జాలకు గురైన బతుకమ్మ కుంట 6 ఎకరాలను కాపాడగలిగాం. జంట నగరాల అభివృద్ధికి దివంగత పీజేఆర్ గారు అందించిన సేవలు ప్రజల్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి. 1.2 కోట్ల జంట నగరాల ప్రజల దాహార్తి తీరిందంటే అది పీజేఆర్ గారి నాయకత్వంలో జరిగిన పోరాటాల ఫలితమే. అలాంటి పీజేఆర్ పేరును ఫ్లైఓవర్‌కు పెట్టుకోవడం ఎంతో సముచితం. తగిన స్థలం గుర్తిస్తే పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచంలోనే ఫార్చూన్ 500 కంపెనీల్లో 85 కంపెనీలు హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి. లక్షలాది మంది యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించాలన్న సంకల్పంతోనే 2.8 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను సాధించాం. ఈ నగరాన్ని మరింత గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం రూపొందించిన  ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2028 వరకు రాజకీయాలను పక్కన పెడుతాం. అభివృద్ధికి అందరూ సహకరించాలి. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , ప్రజా ప్రతినిధులు అనిల్ కుమార్ యాదవ్ , అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి , అద్దంకి దయాకర్ , బల్మూరు వెంకట్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ ఫ్లైఓవర్‌కు దివంగత పీజేఆర్ ఫ్లైఓవర్‌గా నామకరణం చేసినందుకు వారి కుమార్తె విజయారెడ్డి తో పాటు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.