* కన్నుల పండువగా మహీంద్రా హిల్స్ జగన్నాథ స్వామి రథ యాత్ర*
* కన్నుల పండువగా మహీంద్రా హిల్స్ జగన్నాథ స్వామి రథ యాత్ర*
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
జగన్నాధ మందిరంలోని మహారాజ్ త్రిదండి శ్రీ భక్తి సౌరభ్ నారాయణ మహరాజ్ పవిత్ర ఆశీస్సులు, కొవ్వూరు మఠం నుండి విచ్చేసిన శ్రీ వామన మహరాజ్ పుణ్య హస్తాలతో జగన్నాథ స్వామి రథ యాత్ర కన్నుల పండువగా జరిగింది. భక్తి భరిత ఉత్సాహం, సాంస్కృతిక వైభవంతో సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్ లో 33వ వార్షిక శ్రీ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించబడింది. శ్రీ జగన్నాథ మందిరం మరియు గోశాలా ఆధ్వర్యంలో, హరినామ ప్రచార సమితి సహకారంతో జరిగిన ఈ మహోత్సవంలో మూడు వేలకు పైగా భక్తులు పాల్గొన్నారు. పావన రథాన్ని లాగి జగన్నాథ స్వామి ఆశీర్వాదాలను పొందారు. పుష్పాలతో అద్భుతంగా అలంకరించబడిన రథం, సద్భావనతో ముందుకు కదులుతుండగా, శ్రద్ధతో కూడిన “హరే కృష్ణ హరే రామ” నినాదాలు అంతటా మార్మోగీస్తు, పరిసరాలను ఆధ్యాత్మికతతో నింపారు. రథం ముందు మహిళలు, బాలికలు సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తూ, సంప్రదాయ నృత్యాలు, భక్తి గీతాలతో భక్తుల మనసులను మంత్రముగ్ధం చేశారు.రథయాత్ర ముగింపు సమయానికి, జగన్నాథునికి భక్తి పూర్వకంగా చప్పన్ భోగ్ (56 రకాల నైవేద్యం) సమర్పించబడింది. ఆ తరువాత ఘనంగా ఆరతి నిర్వహించి, మహా ప్రసాదం అందరికి పంపిణీ చేయబడింది. ఈ మహోత్సవం మొత్తాన్ని మందిర దాత మారునూరి శ్రీకాంత్, హరినామ ప్రచార సమితి సభ్యుల కృషితో అత్యంత సమర్థంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తుకారాం గేట్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ప్రధాన పాత్ర పోషించారు. వారు రథయాత్ర సజావుగా జరిగేలా రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేసి, భక్తులు రథాన్ని లాగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాట్లు చేశారు. భక్తులు, ఆలయ నిర్వాహకులు పోలీస్ చేసిన ఏర్పాట్లతో సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు, ఇన్స్పెక్టర్లు స్వయంగా రథాన్ని లాగి జగన్నాథుని ఆశీర్వాదం పొందారు. ఈ రథయాత్ర, భక్తుల ఐక్యత, ఆధ్యాత్మికత, మన సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి ఒక్కరికి ఆనందం, భక్తి స్ఫూర్తిని అందించింది.