జూలై 11 వ తేదీన లాల్ దర్వాజా బోనాలు
జూలై 11 వ తేదీన లాల్ దర్వాజా బోనాలు
దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 30, జులై 1,2 వ తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లాల్‌దర్వాజా శ్రీ మహంకాళి 117వ వార్షిక బోనాల జాతర ఉత్సవాలు జూలై 11 వ తేదీన ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, ప్రధాన కార్శదర్శి పోసాని సతీష్ ముదిరాజ్, బి. అమర్ నాథ్ యాదవ్, కోశాధికారి ఎ. చంద్రకుమార్, జి. హరీష్ గౌడ్ లు తెలిపారు. ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జూలై 11వ తేదీన ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాలు 21వ తేదీవరకు కొనసాగుతాయన్నారు. జూలై 11వ తేదీన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవి అభిషేకం, ద్వజా రోహణ, శిఖర పూజ, సాయంత్రం కలశస్థాపనతో ఉత్సవాలు లాంచనంగా ప్రారంభమవుతాయన్నారు. జూలై 13 వ తేదీన సాయంత్రం శాలిబండ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటమును భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. అనంతరం 9రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. జూలై 20వ తేదీన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనాల సమర్పణ, రాత్రికి ప్రపంచ శాంతి కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. జూలై 21వ తేదీన సోమవారం పోతరాజు స్వాగతం, అమ్మవారి భవిష్య వాణి వినిపించే రంగం కార్యక్రమం, అమ్మవారి బ్రహ్మాండమైన సామూహిక ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
*దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 30, జూలై 1,2 వ తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు* .....
లాల్ దర్వజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మూడు రోజుల పాటు 11వ వార్షిక బోనాల ఉత్సవాలు జూన్ 30, జూలై 1,2 తేదీలలో జరుగనున్నట్లు ఆలయ కమిటీ కన్వీనర్ జి.అరవింద్ గౌడ్ తెలిపారు. 30వ తేదీన తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందన్నారు. జూలై 1 వ తేదీన సాయంత్రం 5గంటలకు ఇండియా గేట్ నుంచి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి తెలంగాణ భవన్ లో ప్రతిష్ఠాపన మహోత్సవాలు, 2వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, పోతరాజు స్వాగతం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఢిల్లీ బోనాల ఉత్సవాలలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని కన్వీనర్ జి. అరవింద్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ మాజీ చైర్మన్ లు బంగ్లా రాజు, సి. వెంకటేష్, బల్వంత్ యాదవ్, కె. వెంకటేష్, సి. రాజేందర్ యాదవ్, తిరుపతి నర్సింగ్ రావు, షీరా రాజ్ కుమార్, రాజేందర్ ఆలయ కమిటీ సంస్కృతిక కార్యదర్శులు ఎ.వినోద్ కుమార్, కె. సురేష్ బాబు, ప్రచార కార్యదర్శులు ఎస్. శేష నారాయణ, ఎ. యశ్వంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.