తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ పై సమీక్ష

తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ పై సమీక్ష

తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ 

ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయండి

రావిర్యాల నుంచి అమ‌న్‌గ‌ల్ రూట్​లో మూడుచోట్ల నైట్​ సఫారీలు ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించండి

అధ్య‌య‌నం చేశాకే  గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూప‌క‌ల్ప‌న చేయాలి

భూములిచ్చే రైతులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలి

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సుదీర్ఘ స‌మీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే విధంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  నూత‌నంగా ఏర్ప‌డ‌నున్న ఫ్యూచర్ సిటీలో నెల‌కొల్ప‌నున్న ప‌రిశ్ర‌మ‌లు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వ‌సతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలన్నారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారి అంశాలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సుదీర్ఘ స‌మీక్ష నిర్వ‌హించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమన్ గల్ – చేవెళ్ల – శంకర్ పల్లి – సంగారెడ్డి వరకు) అధికారులు రూపొందించిన అలైన్‌మెంట్‌లో మరికొన్ని మార్పుల‌ను ముఖ్య‌మంత్రి సూచించారు. ప్ర‌తిపాదిత రేడియ‌ల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ స‌మీక‌ర‌ణ, భూ సేక‌ర‌ణ‌ చేయాల‌న్నారు. భూములిచ్చే రైతులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు. మనదగ్గర డ్రైపోర్టును ఏపీలోని మ‌చిలీప‌ట్నం, కాకినాడ రేవుల‌తో అనుసంధానం చేసే అవకాశాలపై అధ్య‌య‌నం చేశాకే  గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని,  ఇన్‌ల్యాండ్ వాట‌ర్ వేస్ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సీఎం అన్నారు. #ORR - #RRR మ‌ధ్య రావిర్యాల నుంచి అమ‌న్‌గ‌ల్  వ‌ర‌కు నిర్మించ‌నున్న ర‌హ‌దారిలో మూడు చోట్ల ఉన్న అట‌వీ ప్రాంతాల‌ను నైట్ స‌ఫారీలుగా మార్చే అంశంపై కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. కాలిఫోర్నియాలో ఆపిల్ పండ్లతోటలోనే 'ఆపిల్' సంస్థ కార్యాలయం, బెంగ‌ళూరులో జిందాల్ నేచ‌ర్ కేర్ తరహాలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలోనూ పర్యావరణహిత నిర్మాణాలకు అధ్యయనం చేయాలన్నారు. ప్రకృతి సౌంద‌ర్యానికి నెలవైన రాచకొండలో సినీ ప‌రిశ్ర‌మ‌ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు.ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూ స‌మీక‌ర‌ణ‌, భూ సేక‌ర‌ణ విష‌యంలో అన్ని శాఖ‌ల అధికారులు సమన్వయంతో పని చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు.