బాలాపూర్​ గణేష్​ లడ్డును ప్రధాని నరేంద్రమోదీకి బహుకరిస్తా : కొలను శంకర్​ రెడ్డి

బాలాపూర్​ గణేష్​ లడ్డును  ప్రధాని నరేంద్రమోదీకి బహుకరిస్తా : కొలను శంకర్​ రెడ్డి

రూ. 30. 01 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డును సొంతం చేసుకున్న బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి 

ప్రధాని నరేంద్ర మోడీ కి బాలాపూర్ గణేష్ లడ్డును బహుకరిస్తా

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

ప్రపంచ ప్రసిద్దిగాంచిన బాలాపూర్​ గణపతి 21 కిలోల లడ్డు వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్​ గ్రామం బొడ్డురాయి వేదికయ్యింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బాలాపూర్​ గణేష్​ లడ్డు వేలం పాట వేలాదిమందిభక్త జన సందోహం నడుమ బాలాపూర్​కు చెందిన కొలను శంకర్​రెడ్డి, కర్మాన్​ఘాట్​కు చెందిన లింగాల దశరథ్​ గౌడ్​, సాహెబ్​నగర్​ కు చెందిన సామ ప్రణీత్​ రెడ్డి( అర్బన్​ గ్రూప్), నాదర్​గూల్​ కు చెందిన గీతా డైరీ లక్ష్మీనారాయణ, అనే ప్రధాన పోటీదారుల మధ్య రూ.1016 తో ప్రారంభమై హోరాహోరీగా సాగిన పోరులో రూ. 30.01 లక్షలకు బాలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కొలను శంకర్ రెడ్డి  21 కిలోల లడ్డును సొంతం చేసుకున్నారు. తాజాగా 31వ సారి బాలాపూర్​ గణేష్​ లడ్డును వేలం పాటలో  దక్కించుకున్న జాబితాలో కొలను శంకర్ రెడ్డి చేరిపోయారు. 44 వసంతాల గణేష్​ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గత  30 సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బాలాపూర్​ గణేష్​  లడ్డు వేలం పాటకు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2020లో బాలాపూర్​ గణపతి లడ్డు వేలం పాటను రద్దు చేశారు.  దీంతో ఆ లడ్డును అప్పట్లో బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్​రెడ్డి బృందం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహుకరించారు. 2021లో జరిగిన వేలం పాట కంటే 2022లో  5.70లక్షలు రెట్టింపు, 2022 లో జరిగిన వేలం పాట కంటే 2023లో 2.40 లక్షలు, 2023 లో జరిగిన వేలం పాట కంటే ఈ  యేడు మూడు లక్షలు అధిక ధర పలికింది. బాలాపూర్​ లడ్డువేలం పాట చరిత్రలో ఈ యేడు రికార్డు బ్రేక్​ చేసింది. లడ్డు వేలం పాటలో గడిచిన 30 ఏళ్లలో 1,82,51,950కోట్ల రూపాయలు బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి సొంతం కాగా అందులో ని 1,58,07,970 కోట్ల రూపాయలతో బాలాపూర్​ గ్రామంలో పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగింది. అయితే గత సంవత్సరం 2023లో బాలాపూర్ గణేష్ లడ్డు ను వేలం పాటలో దక్కించుకున్న దాసరి దయానంద్​ రెడ్డి రూ. 27 లక్షల నగదు ను గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు ను అందజేసిన దాసరి దయానంద్​ రెడ్డికి గణేష్ ఉత్సవసమితి తరపున లక్ష రూపాయల విలువ గల బంగారు చైన్ ను అందజేశారు.

వేలం పాటలో గణేష్​ లడ్డును సొంతం చేసుకుంది వీళ్లే ...

1994లో జరిగిన బాలాపూర్​ లడ్డు వేలం పాటలో కొలన్​ మోహన్​రెడ్డి రూ. 450  కైవసం చేసుకున్నారు. 1995లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ. 4500, 1996లో కొలన్​ క్రిష్ణారెడ్డి రూ.18వేలు, 1997లో కొలన్​ క్రిష్ణా రెడ్డి రూ.28వేలు, 1998లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ.51వెయ్యి, 1999లో కళ్లెం అంజిరెడ్డి రూ. 65 వేలు,  2000లో కళ్లెం ప్రతాప్​ రెడ్డి రూ. 66వేలు, 2001లో జి.రఘునందన్​ చారి రూ. 85వేలు, 2002లో కనడ మాధవరెడ్డి రూ.ఒక లక్ష 5 వేలు, 2003లో చిగిరింత బాల్​రెడ్డి రూ.ఒక లక్ష55వేలు, 2004లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ. 2లక్షల ఒక వెయ్యి, 2005లో ఇబ్రం శేఖర్​ రూ. 2లక్షల 8 వేలు, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి రూ. 3లక్షలు, 2007లో జి.రఘునందన్​ చారి రూ. 4లక్షల15 వేలు, 2008లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ.5లక్షల 7వేలు, 2009లో సరిత రూ. 5లక్షల10వేలు,  2010లో కొడాలి శ్రీధర్​ బాబు రూ. 5లక్షల35వేలు, 2011లో కొలన్​బ్రదర్స్​ రూ. 5లక్షల45వేలు, 2012లో పన్నాల గోవర్థన్​ రెడ్డి రూ. 7లక్షల50వేలు, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9లక్షల26 వేలు, 2014లో సింగిరెడ్డి జైహింద్​ రెడ్డి రూ. 9 లక్షల50వేలు, 2015లో కళ్లెం మాధవ మోహన్​ రెడ్డి రూ. 10లక్షల32వేలు,  2016లో స్కైలాబ్​ రెడ్డి రూ. 14లక్షల 65 వేలు, 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15లక్షల60 వేలు, 2018లో తేరేటిపల్లి శ్రీనివాస్​ గుప్త రూ. 16లక్షల60 వేలు, 2019లో కొలన్​ రామ్​ రెడ్డి రూ.17లక్షల60 వేలు  బాలాపూర్​ లడ్డును వేలం పాటలో సొంతం చేసుకున్న వారిలో ఉన్నారు. 2020లో కరోనా కారణంగా వేలం పాట నిర్వహించలేదు. దీంతో ఆ యేడు గణేష్​ లడ్డును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహకురించారు. 2021లో 18లక్షల 90వేలకు మర్రి శశాంక్​ రెడ్డి, 2022లో 24లక్షల 60వేలకు బాలాపూర్​ గణేష్​ అసోసియేషన్​ మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డును సొంతం చేసుకున్నారు. 2023 లో 27లక్షలకు దాసరి దయానంద్​ రెడ్డి కైవసం చేసుకున్నారు. తాజాగా 2024లో బాలాపూర్​ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్​ నేత కొలను శంకర్​ రెడ్డి 30.01లక్షలకు వేలం పాటలో సొంతం చేసుకున్నారు. 

తెల్లవారుజామున 5.30గంటలకే ప్రారంభమయిన నిమజ్జన పూజలు ....

తెల్లవారుజామున 5.30గంటల నుంచే బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి.  అనంతరం బాలాపూర్​ గణేష్​ మండపం నుంచి  బాలాపూర్​ పుర వీధులగుండా సన్నాయి మేళాలు .. భజన కార్యక్రమాల నడుమ బాలాపూర్​ గణపతి ఊరేగింపుగా ముందుకు కదిలింది.  దారిపొడవునా బాలాపూర్​ గ్రామస్థులు  కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతులు పట్టారు. 10.15 గంటల ప్రాంతంలో బాలాపూర్​ గణపతి డిసిఎం వ్యాన్​లో బొడ్డురాయి వద్దకు చేరుకుంది. ఉదయం 10.35 గంటలకు బాలాపూర్​ గణేష్​ లడ్డు వేలం పాట అట్టహాసంగా ప్రారంభయ్యింది.

ప్రధాని నరేంద్ర మోడికి బహుకరిస్తా  : కొలను శంకర్ రెడ్డి

బాలాపూర్​ గణేష్​ లడ్డును వేలం పాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి అన్నారు. వేలం పాటలో దక్కించుకున్న లడ్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ కి బహుకరిస్తున్నట్లు  చెప్పారు. ఈ యేడు ఎలాగైనా లడ్డును సొంతం చేసుకుందామని వేలంపాటలో పాల్గొన్నానని, అదృష్టానికి 2024లో 30.01 లక్షలకు సొంతం చేసుకున్నట్లు కొలను శంకర్ రెడ్డి పేర్కొన్నారు.