సరికొత్త నిబంధనలతోభూ సమీకరణకు కొత్త చట్టం రూపకల్పన
-మార్గదర్శకాలకు త్వరలోనే ప్రతిపాదనలు
- విస్తరిత హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ సిటీ: భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్‌ఎండీఏ(HMDA) పరిధిలో అమలు చేయనుంది. భూ సమీకరణ పథకం-2017తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవడంతో ఆస్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. సరికొత్త నిబంధనలు, మార్గదర్శకాలతో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవల్‌పమెంట్ (ఎల్‌పీఏడీ) అనే ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఓ కన్సల్టెన్సీని నియమించేందుకు హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది.
పట్టాభూములకే అవకాశం
అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితమవ్వకుండా ఔటర్ అవతల మినీ నగరాలు, టౌన్‌షి్‌పలను తీసుకొచ్చేందుకు అప్పటి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్-2017 తీసుకువచ్చింది. అయితే దానికి ఆశించిన స్పందన రావడం లేదు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌ను 733 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టగా, అదే తరహాలో స్వరాష్ట్రంలోనూ ఎనిమిదేళ్ల క్రితం తీసుకొచ్చారు. నాటి చట్టం ప్రకారం ఇన్ముల్ నర్వ (95 ఎకరాలు), లేమూరు (84 ఎకరాలు)లో లే అవుట్‌లు అభివృద్ధి చేయగా, ప్రతాపసింగారం (110 ఎకరాలు)లో పనులు చేపట్టాల్సి ఉన్నది. ఈ స్కీమ్ వచ్చిన ఎనిమిదేళ్లలో మూడు ప్రాంతాల్లో 289 ఎకరాలే సేకరించారు. 2017లో ఉన్న కొన్ని నిబంధనలు ప్రభుత్వానికి, రైతులకు ఇబ్బందికరంగా మారాయి. కేవలం పట్టా భూములకే అవకాశం కల్పించారు. అసైన్డ్, సీలింగ్ భూములు సేకరించే అవకాశం లేదు.