6 ఏళ్లలో రూ.20 వేల కోట్లకుపైగా అభివృద్ది పనులు చేశాం : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
6 ఏళ్లలో రూ.20 వేల కోట్లకుపైగా అభివృద్ది పనులు చేశాం :
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
ప్రజా క్షేత్ర్, జమ్మికుంట :
గడిచిన 6 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం రూ.20 వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు స్థానిక బీఆర్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయనతో కలిసి జాతీయ ఉపాధి పథకం కింద వీణవంకలో రూ.78 లక్షల వ్యయంతో నిర్మించిన 18 అంతర్గత సీసీ రోడ్లను, అట్లాగే జమ్మికుంట మండంలోని గండ్రపల్లి, ఇతర గ్రామాల్లో 78 లక్షల వ్యయంతో నిర్మించిన 13 అంతర్గత రోడ్లను ప్రారంభించారు. స్థానిక బీజేపీ నాయకుల నివాసాలకు వెళ్లి ముచ్చటించారు. అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో జాతీయ ఉపాధి హామీ నిధుల కింద 78 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 18 అంతర్గత సీసీ రోడ్లున ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు.. మోదీ ప్రభుత్వం రోడ్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. నేను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉంటూ ఎక్కువ నిధులు కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చానంటే అవి రోడ్ల కోసమే.
కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం గత ఆరేళ్లలో మొత్తంగా 20 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. అందులో సింహభాగం గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి సడక్ యోజన, సీఆర్ఐఎఫ్ కార్యక్రమాల నిధులతోపాటు జాతీయ రహదారుల విస్తరణ కోసమే ఎక్కువ నిధులు తీసుకొచ్చిన. ఎందుకంటే ఏ దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లా, గ్రామమైనా రవాణా సౌకర్యాలు బాగుంటేనే అవి బాగుపడతాయి. నేను 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు రెండేళ్ల కాలాన్ని కరోనా మింగేసింది. అయినా ప్రజల కోసం మోదీని ఒప్పించి భారీ నిధులు తీసుకొచ్చా. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇంకా నిధులు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. మొదటిసారి ఎంపీ అయినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రమంతా తిరిగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి లోనెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యంతో పనిచేస్తున్నా. అందుకోసం స్థానిక ఎమ్మెల్యేలందరితో కలిసి అన్ని గ్రామాలు, మండలాలను అభివృద్ది చేస్తున్నామని,అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.