తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే : ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే : ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే..
         ప్రజల్ని మోసం చేసినవారిని వదిలిపెట్టేది లేదు : ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
 తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమేనని ప్రజల్ని మోసం చేసినవారిని వదిలి పెట్టేది లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ హెచ్చరించారు. పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ  పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయినట్టు ఇటీవల పత్రికల ద్వారా వార్తలు వచ్చాయి. కమిషన్ కాలపరిమితి పొడిగింపుల అనంతరం తుది విచారణ పూర్తయిందని, నివేదిక త్వరలో ప్రభుత్వానికి అందించబోతున్నట్టు ప్రకటించారు. ఈ తుది విచారణలో పాల్గొన్న వారంతా "క్యాబినెట్ నిర్ణయమే" అంటుండటం గమనార్హం. సాంకేతిక విషయాలు తమకు తెలియవని, నిపుణుల సూచనల ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా క్యాబినెట్ ఉపసంఘం తీసుకున్న నిర్ణయం ఆధారంగా జరిగిందన్న వాదన వల్ల తప్పిదానికి బాధ్యత ఎవరిదన్నది ప్రజలకు స్పష్టంగా తెలియకుండానే మిగిలిపోతోంది.మధ్య మధ్యలో సిడబ్ల్యూసీ పేరు ఎత్తుతూ తప్పించుకోవడానికి కబుర్లు చెప్పినట్టు కనిపిస్తోందన్నారు. చేసిన తప్పును అంగీకరించి ప్రజల ముందు బహిరంగంగా నివేదించి ఉంటే నైతికత కలిగిన నాయుకత్వంగా గుర్తింపు పొందేది. కానీ "అనారోగ్యం" అనే కారణంతో బహిరంగ విచారణకు రావడం మానుకుంటూ, ఏకాంతంగా మాట్లాడతాను అని చెప్పిన తీరు ప్రజల్లో అనుమానాలకే దారి తీస్తోంది. ఈ దశలో అసలు ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమి దాచాలనుకుంటున్నారు?కాళేశ్వరం పనులు ప్రారంభమైనప్పటి నుంచే సిఏజి వార్షిక నివేదికల ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజబుల్ కాదని, వ్యయప్రయోజన సంబంధం లేదు అని అన్నారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారని స్పష్టంగా పేర్కొంటూ వచ్చింది. అయినా ప్రభుత్వం చెల్లింపులు కొనసాగించడమే కాక, అక్రమాలకు ఆస్కారం కలిగింది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) కూడా ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టులో జరిగిన తప్పులను, అవకతవకలను ఎత్తిచూపింది. అయినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా చర్యలు తీసుకోవడం గానీ, లోపాలు సరిచూడడం గానీ జరగలేదు.ప్రతిదానికీ "క్యాబినెట్ నిర్ణయం" అన్నదే నడుస్తోంది. అంటే మేము ఒక్కరే దోచుకోలేదు, క్యాబినెట్ మొత్తమే దోచుకుందన్న అర్థమా? కాళేశ్వరం కాలువలు కొట్టుకుపోయినట్టు వార్తలు నిజమా కాదా? కాలువలు కుంగిపోయిన మాట వాస్తవమా కాదా? బ్యారేజ్‌కి బీటలు పడటం జరిగిందే కదా? అని ప్రబాకర్ ప్రశ్నించారు.ఇవన్నీ దేశం మొత్తానికి తెలిసిన విషయాలే. దీని గురించి ముఖ్యమంత్రి నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది.తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే. కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడి హట్టికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. అనంతరం వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం టెండర్లను మార్చకుండా అదే సంస్థలకు మేడిగడ్డ అప్పగించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పటికీ వివరణ రావాల్సిన అవసరం ఉంది.  భారతదేశంలో లేదా ఏ రాష్ట్రంలో అయినా ఇన్నిసార్లు అంచనాలు పెరిగిన ప్రాజెక్ట్‌ను చూసిన దాఖలాలు లేవు. సాధారణంగా ప్రాజెక్టుల ఖర్చు ఎస్కలేషన్‌ కొన్ని కారణాల వల్ల జరిగితే అది సహజం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంచనాలు డబుల్, ట్రిపుల్‌గా మారిపోయాయి. ఈ విషయంలో పీసీ ఘోష్ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, టెండర్లు పిలవకుండానే అప్పగించడమో, సిఏజీ స్పష్టంగా "Undue favour to the contractor" అన్న అంశాన్ని ఎత్తిచూపడమో.. ఇవన్నీ అప్పట్లోనే ఆపి, ముఖ్యమంత్రి స్పందించి ఉండాల్సింది. కానీ అప్పుడు స్పందించకపోవడం పెద్ద తప్పిదం.ఇప్పుడు పీసీ ఘోష్ విచారణ ఒక స్కూల్ లో వైవా పరీక్షలా మారింది. ముందుగా ఎవర్ని ఏమి అడుగుతున్నారో చూసి, మూడో వ్యక్తి ప్రిపేర్ అయ్యేలా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు.. కనీసం పాస్ మార్కులు కాకపోయినా డీటైన్ కాకూడదనే ప్రయత్నంగా మారింది. అందుకే ఈ విచారణలో పీసీ ఘోష్ రకరకాల కథనాలు చెబుతూ, అన్నీ "క్యాబినెట్ నిర్ణయం" కింద తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందన్నారు..కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత, కాలువలు కొట్టుకుపోయిన తర్వాత, మోటార్లు మొరాయించిన తర్వాత, బ్యారేజ్‌కు బీటలు వారిన తర్వాత నీరు నిల్వ ఉంచలేమన్న విషయమే ప్రధానంగా చర్చకు వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ సమస్యను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదించారు. ప్రతి రాష్ట్రంలో స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ అప్పటి ప్రభుత్వ కాలంలో, ఈ మేడిగడ్డ గాని, అన్నారం గాని, సుందిల్ల గాని ప్రాజెక్టులకు సంబంధించి, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒకసారి కూడా విషయాలను తెలియజేయలేదు. వీటి పరిశీలన కోసం విజిట్ చేయాలని కూడా ప్రయత్నించలేదు. అంతా నా వల్లే... పారుతున్న నీళ్లు, పండుతున్న పంట, వస్తున్న దిగుబడి అన్నట్టుగా అప్పటి ముఖ్యమంత్రి చెప్పడం విచారకరమన్నారు..భారతీయ జనతా పార్టీ మొదటి నుండి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తూ వచ్చింది. కాళేశ్వరం లో జరిగిన అక్రమాలకు సంబంధించి సీబీఐని విచారణకు చేరవేయాలని మా పార్టీ తరఫున అనేకసార్లు కోరాం. ఈడీ రంగప్రవేశం చేయాలని డిమాండ్ చేశాం. ప్రాజెక్టు లో జరిగిన అవినీతిని తేల్చడానికి ఇది అత్యవసరమైన చర్య. అయినా ఇప్పుడు తుది నివేదిక ఏమి ఇస్తుందో చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకున్న నాయకులనూ, పార్టీలనూ, అప్పటి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్నది. మరోవైపు ఏసిబి తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఒక్కొక్క అధికారి ఇళ్లల్లో సెర్చ్ చేస్తే, సాధారణ స్థాయిలో కాకుండా, భారీగా అవినీతి, ఆస్తులు, వివరాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇరిగేషన్ ఇంజినీర్ల అవినీతిని ఏసిబి వెలుగులోకి తీసుకొస్తోంది. అప్పటి ప్రభుత్వాధినేతల అవినీతిని కూడా బయటపెట్టాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవద్దు. మేము కోరినట్లు సీబీఐ, ఈడీ రంగప్రవేశం చేయాలన్న డిమాండ్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాం.తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరిగే సిడబ్ల్యూసీ మీటింగ్, బహిరంగ సభ, పార్టీ కార్యక్రమాల్లో ఒకచేత రాజ్యాంగ పుస్తకం పట్టుకుని "మేము రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఉన్నాం" అని చెప్పడం చూస్తున్నాం. తాజాగా ప్రతీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని కేంద్రం మార్గదర్శక సూత్రాలు పంపించినా, దేశంలోని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 18 నెలలుగా గ్రామాల్లో పాలన నిలిపివేసింది. నగరాలు మురికి కూపాల్లా మారాయి. కేంద్రం నిధులు అందించకపోతే సాధారణ కార్యకలాపాలు కూడా ఆగిపోతున్నాయి. ఆర్థిక సంఘం ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రాలకే భవిష్యత్‌లో నిధులు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, ఈ ప్రభుత్వం మాత్రం స్పందించలేదన్నారు.. ఎన్నికలు వస్తున్నాయ్ అంటూ మాటలతో మోసం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసారు..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలతో అధికారంలోకి వచ్చామనే నమ్మకంతో కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చేస్తు కుట్రను చూస్తున్నాం. ప్రజలు మరోసారి మోసపోయే స్థితిలో లేరు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వీరిని ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఏజీ, పిఏసీ, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీలు ఇచ్చిన నివేదికల్ని కమిషన్ తీసుకున్నదా లేదా అన్నది చూస్తాం. దోషుల్ని కాపాడుతారో, పట్టుకుంటారో తేలుతుంది.  కాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో దోచుకున్నవాళ్లను వదిలిపెట్టబోమని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోందన్నారు.