త్యాగానికి ప్రతీక బక్రీద్
ఘనంగా బక్రీద్
భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు
దిశ, చార్మినార్ :
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకొనే పండుగల్లో ఒకటైన బక్రీద్ పండుగ పర్వదినాన్ని శనివారం ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. వేలాది మంది ముస్లిం సోదరులు మీరాలం ఈద్గాలో సామూహికంగా నమాజులు పఠించారు. చార్మినార్ మక్కా మసీద్ లో ఇమామ్ మౌలానా రిజ్వాన్ ఖురేషి సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం బక్రీద్ పండుగ ప్రాముఖ్యత ను వివరించారు. ప్రతి ఒక్కరు స్తోమత ను బట్టి ఖుర్బానీ ఇవ్వాలని గుర్తు చేశారు. హజ్రత్ ఇబ్రహీం కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ముస్లిం సోదరులు అందరూ పాటించాలన్నారు. యువత పాశ్చాత్య సాంస్కృతికి అలవాటు పడుతున్నారు. ముస్లింలు అల్లాహ్ ప్రవక్త బోధనలను శిరసావహించాలని, వారు చూపించిన మార్గంలో నడవాలని సూచించారు. దైవ ప్రవక్తలలో ఒకరైన హజ్రత్ ఇబ్రహీం (ఆలై) తన ప్రియ తనయుడైన హజ్రత్ ఇస్మాయిల్ (ఆలై) ల త్యాగ నిరతిని స్మరించుకుంటూ జరుపుకునే పండుగే బక్రీద్. హజ్ యాత్ర చివర్లో ఈ పండుగను జరుపుకొంటారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అల్లాహ్ ఆదేశంతో ఇబ్రహీం అనే ప్రవక్త తన ఏకైక కుమారుడిని సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆయన త్యాగానికి సంతోషించిన అల్లాహ్ అతడి కుమారుడి బదులు గొర్రెను ఉంచుతాడు. నాటి నుంచి బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగనుపురస్కరించుకుని ఉదయమే తల స్నానాలు చేసి, నూతన వస్త్రాలు ధరించారు. అత్తరు, సుగంధ ద్రవ్యాలు పూసుకొని మసీదులు, ఈద్గాలకు వెళ్లారు. ఉలేమాలు ఇచ్చే ధార్మిక ప్రసంగాల తర్వాత ప్రత్యేక నమాజ్ చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ సందర్భంగా పత్తర్ కా ఘోష్, మటన్ బిర్యానీ, కుర్మా లాంటి రుచికరమైన వంటలను వండుకున్నారు. ఖీర్, షీర్ కుర్మాలను కూడా పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేశారు. బక్రీద్ పండుగ రోజున మేకలు, గొర్రెలను బలివ్వడం ముస్లిం సంప్రదాయం కావడంతో ఆర్థిక స్థోమతగల వారు వాటిని కొనుగోలు చేస్తారు. నగర చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు మేకలు, గొర్రె పొట్టేళ్లను తెచ్చి పాతబస్తీలో విక్రయించారు. ఒక్కో పొట్టేలు ధర రూ.13 వేల నుంచి నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. మీరాలం ఈద్గా, చార్మినార్, మక్కామసీదు, మదీనా, బార్కాస్ ప్రాంతాలతోపాటు పాతబస్తీలోని పలు బస్తీల్లో బందోబస్తు నిర్వహించారు. మీరాలం ఈద్గా, చార్మినార్ మక్కా మసీదు, బార్కా స్, జామా మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ధనిక, పేద తారతమ్యం లేకుండా ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్‌ను జరుపుకున్నారు. పండుగ సందర్బంగా దేశంలోని వివిధ నగరాల్లోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్లిం సోదరులతో క్రిక్కిరిసాయి. దక్షిణ మండలం డిసిపి స్నేహ మెహ్రా తదితరులు ఈద్గా నుంచి ప్రార్థనలు ముగించుకొని వచ్చిన చిన్నారులకు, ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.