దమ్ముంటే చర్చకు రండి... రేవంత్ కు కేటీఆర్ సవాల్
దమ్ముంటే చర్చకు రండి...
రేవంత్ కు కేటీఆర్ సవాల్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 5 :
ఎల్బీస్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా చర్చకు రెడీ అని ప్రకటించారు. అసెంబ్లీలోనైనా చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఇంకా కావాలంటే సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో అయితే మరీ మంచిదన్నారు. ఈ ఉదయం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమంపై చర్చించేందుకు రేవంత్ రెడ్డికి 72 గంటల సమయం ఇచ్చారు కేటీఆర్. చేసినవాటిపై ప్రిపేర్ అయ్యేందుకు ఈ టైంలో ఇచ్చినట్టు పేర్కొన్నారు. "8వ తేదీ ఉదయానికి ప్రెస్‌క్లబ్‌లో ఉంటాను. రేవంత్ రెడ్డి ఒక్కడు వస్తారో, మంత్రివర్గాన్ని తీసుకొస్తోరో వాళ్ల ఇష్టం. కార్యకర్తలతో వచ్చినా రెడీ. రేవంత్ రెడ్డికి కుర్చీ వేసి పెడతాం. ఆయన కోసం ఎదురు చూస్తాం. అక్కడ కాదు అనుకుంటే రాష్ట్రంలో ఎక్కడైనా నేను చర్చకు సిద్ధమే. అసెంబ్లీలోనా, లేదా కొండారెడ్డి పల్లెలో, చింతమడకలో ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం." అని సవాల్ చేశారు. ప్లేస్, టైమ్, డేట్ అన్ని సీఎం ఇష్టం.. మేం ఎప్పుడైనా సిద్ధమే అంటున్నారు కేటీఆర్. బేసిన్‌కు, బేసిక్కు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని అలాంటి వ్యక్తి సీఎంగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్‌కు కేసీఆర్ అవసరం లేదని తాము చాలంటూ చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, ఆయన సన్నిహితులకు నియామకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.దేశంలో ఎవరూ రైతులకు చేయని విధంగా తెలంగాణలో రైతులకు కేసీఆర్ మేలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. వాటి గురించి తెలంగాణలో
ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని అన్నారు. చేసింది చెప్పుకోలేని రేవంత్ రెడ్డి సభ పెట్టి బూతులు తిడుతూ ఛాలెంజ్‌లు విసురుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయడం లేదని అడిగితే విమర్శలు చేసే రేవంత్ రెడ్డి... బనకచర్లతో గోదావరి తరలించుకుపోతున్నా గట్టిగా అగడం లేదని అన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు క్యూలో నిల్చుంటున్నారని తెలిపారు. ఈ ప్రబుత్వానికి ఎరువుల పంపిణీ కూడా చేతకావడం లేదని విమర్శించారు. "తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక స్కీం. రైతు బంధుపై ఆక్స్‌ఫర్డ్‌లో చెబితే ఆశ్చర్యపోయారు. అలాంటిది ఎరువులు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి మమ్మల్ని విమర్శిస్తారా? ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండిపోతే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోస్తున్నా జల దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోలేకపోతున్నారు. ఫ్లోరైడ్ మహమ్మరిని కేసీఆర్ తరిమికొట్టలేదా? తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం" అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రికి బేసిన్ల గురించి గానీ, ప్రాజెక్టుల గురించి గానీ కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని, నియామకాలు ఆయన వ్యక్తులకే దక్కుతున్నాయని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల వాటాలో అన్యాయం జరగడం వల్లే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం రైతుబంధును నాట్లు వేసే సమయంలో ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వచ్చే ముందు రైతు భరోసా ఇస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు రైతులకు ఎకరానికి 19 వేల రూపాయలు ఎగ్గొట్టి అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు కోవర్ట్ అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. ఆ ఎమ్మెల్యే
చాలా కరెక్టుగా చెప్పారని, ఆయనను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. తాము కల్పించిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటూ సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.సీఎం తన సభల్లో బూతులు మాట్లాడుతూ రంకెలు వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తామే చాలని అన్నారు. మందబలంతో కాకుండా 10-15 మందితోనే ప్రెస్‌క్లబ్‌కు వస్తామని, మీడియా ముందే అన్ని విషయాలు తేల్చుకుందామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగాలు మిలీయనర్ జోక్
ఏడాదిన్నరలో 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. ఉద్యోగాల భర్తీపై రేవంత్ మాట్లాడటం మిలీనియం జోక్ అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు.. అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశామనడం సిగ్గుచేటన్నారు. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని.. కాంగ్రెస్‌కు మరోసారి అధికారం రావడం కల అని ఎద్దేవా చేశారు.