ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 8.00 గంటల మద్య మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
టిటిడి పటిష్ట ఏర్పాట్లు :
బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశారు. ఎస్వీ మ్యూజిక్ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది. అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు.