ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం సెక్టార్‌ను  బలోపేతం చేయాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం సెక్టార్‌ను  బలోపేతం చేయాలి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌, జులై 28 :
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వివిధ చారిత్రక ప్రదేశాలను  అభివృద్ధి పరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, హార్టికల్చర్‌, హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్‌ ఎం.డి. వల్లూరి క్రాంతి, జనరల్‌ మేనేజర్‌ ఉపేందర్‌రెడ్డిలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఏకో, టెంపుల్‌ టూరిజంలను అభివృద్ధిపరిచే ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్‌, నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధస్థూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్‌, కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరితహోటల్‌, కనిగిరిహిల్స్‌, వైరా రిజర్వాయర్‌, వెలుగుమట్ల అర్బన్‌ పార్కు, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే, ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్‌కు అనువైన వాతావరణం, ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రులు తెలిపారు.  దేశంలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం రామాలయంను మరింత అభివృద్ధిపరిచి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఇందుకు టూరిజం డిపార్టుమెంట్‌, కార్పొరేషన్‌లు కృషి చేయాలని మంత్రులు తెలిపారు.  అందుకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాని, ప్రైవేట్ భాగస్వామ్యంలో గాని వెంటనే మంజూరి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలి. జిల్లాలో టూరిజం డిపార్టుమెంట్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి తగు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉన్నందున, తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం పట్టణ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో  ఉన్న అటవీ ప్రదేశంలో ఏకో టూరిజంకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఖమ్మం పట్టణంలో హరిత హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, కొత్తగూడెంలో ఉన్న హరితహోటల్ ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.