మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై కసరత్తు : అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై కసరత్తు
ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు
ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే పథకం అమలు
ఇకపై ఆర్టీసీలో ప్రవేశ పెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజా క్షేత్ర్, అమరావతి, జూన్ 28 :
ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు.
ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే, ప్రతీ బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
ఆర్థిక కష్టాలున్నా హామీలు నిలబెట్టుకోవాలి.......
రాష్ట్రంలో ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా... ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని... అదే సమయంలో ప్రజాధనం సద్వినియోగం కావాలని, ప్రతీ రూపాయి విలువైనదేనని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. ఆర్ధిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి... ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పొందాలి అనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సమర్ధత పెంచుకోవాలని చెప్పారు. బస్ కాంప్లెక్స్‌లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి బస్సు ప్రయాణం వరకు ప్రయాణికుల్లో సంతృఫ్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.