వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బోనంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ
వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బోనంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
బోనంను ఎంతో పవిత్రంగా భావించే మహిళలను కించ పరిచే విధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు బి. మారుతీ యాదవ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ లు పాల్గొని, మాట్లాడారు. లాల్ దర్వాజ సింహావాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చారిత్రాత్మక వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్దలతో కళాకారుల ఆటపాటల నడుమ ఈ నెల 22 వ తేదీన బంగారు బోనం సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే మంత్రి సాను కూలంగా స్పందించారన్నారు. తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేశారని తెలిపారు. అంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా లోకల్ ఎమ్మెల్యే మాత్రం బోనం పై నోటికి వచ్చి మాట్లాడడం సరికాదన్నారు. మహిళలు ముడికట్టుతో సాంప్రదాయ బద్దంగా బోనంను తయారు చేసుకొని అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి బోనంను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటిది వరంగల్ ఎమ్మెల్యే నాయిని చేసిన వ్యాఖ్యలను బోనంకి మద్యం, మాంసాన్ని ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో పవిత్రంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని, ఎవరు తాగి బోనాలు సమర్పించరని ఈ సందర్భంగా ఆయన మాటలను పూర్తిగా ఖండిస్తున్నామని, తెలంగాణ మహిళలకు ఎమ్మెల్యే నాయిని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.