హైదరాబాద్ లోనే రఫెల్ విమాన భాగాల తయారీ

హైదరాబాద్ లోనే రఫెల్ విమాన భాగాల తయారీ

హైదరాబాద్ లోనే రఫెల్ విమాన భాగాల తయారీ

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 5 :

భారత రక్షణ రంగంలో స్వావలంబన దిశగా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్న రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన అత్యంత కీలకమైన భాగాలను ఇకపై హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం, రఫేల్ యుద్ధ విమానాల ప్రధాన విడిభాగాలను హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తారు. రఫేల్ విమాన భాగాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఏరో స్పేస్ రంగంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతికి, పెరుగుతున్న తయారీ సామర్థ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనంగా నిలుస్తుంది.2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది.ఈ సందర్భంగా డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్‌ మాట్లాడుతూ, “భారత్‌లో మా కార్యకలాపాలను మరింత విస్తరించడంలో ఇది ఒక నిర్ణయాత్మక ముందడుగు. భారత రక్షణ రంగానికి మా సేవలను అందించే అవకాశాన్ని మరింతగా పెంచుతున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ నిర్ణయం ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది” అని తెలిపారు.టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) సీఎండీ సుకరన్‌ సింగ్‌ ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. “భారత రక్షణ రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిది. డసో ఏవియేషన్‌తో కుదిరిన ఈ ఒప్పందం, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తయారీ నైపుణ్యాలను, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి తెలియజేస్తుంది. భారతదేశ వైమానిక, రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.