పర్యాటక అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పర్యాటక అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

* ఎకో, హెల్త్ , టెంపుల్ టూరిజాలకు విడివిడిగా పాలసీలు*

* పర్యాటక అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి *

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. అందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులకు చెప్పారు. ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలకు విడివిడిగా పాలసీలను రూపొందించాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (#SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సూచించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పర్యాటక రంగానికి సంబంధించిన అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జామ్​ నగర్​ లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ప్రస్తావించారు.అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్​ నెస్​ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు..