మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపర్చడం వెనుక పెద్ద కుట్ర : కేంద్రమంత్రి బండి సంజయ్
మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపర్చడం వెనుక పెద్ద కుట్ర
అన్యమతంలోకి మార్చడమే వారి లక్ష్యం
హిందూ ధర్మంపై దాడిని తిప్పికొట్టండి
రామచంద్రమిషన్ చేస్తున్న సేవలు భేష్...
యోగా... ప్రపంచానికి మోదీ అందించిన మహా ‘యోగం’
కరీంనగర్ జిల్లాలో యోగా వేడుకులల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్
ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ ఆంధ్రాలో కొందరు చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇట్లాంటి వ్యాఖ్యలతో హిందూ మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అన్యమతంలోకి మార్చుకోవాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఇది ముమ్మాటికీ హిందూ ధర్మంపై జరిగిన దాడిగా భావించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణాకాలనీలోని రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన యోగా వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ అన్ని టెన్షన్లు దూరం చేసిన మానసిక ప్రశాంతత కలిగించే శక్తి యోగా, ధ్యాన ప్రక్రియలకు ఉందని చెప్పారు. ఈ విషయంలో రామచంద్ర మిషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. హిందూ ధర్మ రక్షణ కోసం రామచంద్ర మిషన్ చేస్తున్న సేవలు ఎనలేనివని అభిప్రాయపడ్డారు. ఇవాళ ప్రపంచలోని 200 దేశాలకుపైగా ప్రజలు యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారంటే మోదీ చేసిన కృషి, మన దేశ సంస్క్రుతి, సాంప్రదాయాలపట్ల ఉన్న నిబద్దతే కారణమని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశాల మధ్య చూసినా ఉద్రిక్త పరిస్థితులే కన్పిస్తున్నాయని రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ ఇరాన్ యుద్దాలతోపాటు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద చర్యలతో ప్రపంచమంతా ఆందోళన చెందుతోందన్నారు. ఇటువంటి తరుణంలో దేశాల మధ్య, మనుషుల మధ్య వైరం తగ్గించడానికి ‘యోగా’ ఎంతో మేలు చేస్తుందని, టెన్షన్లను దూరం చేసి మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగించే సాధనమే యోగా అని స్పష్టం చేశారు.