కేసీఆర్ హెల్త్ స్టేబుల్
కేసీఆర్ హెల్త్ స్టేబుల్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 4 :
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయనకు జ్వరం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, సోడియం స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర అస్వస్థతతో గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యుల బృందం ఒక అధికారిక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. బులిటెన్ ప్రకారం.. కేసీఆర్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయనకు రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగాయని (హై బ్లడ్ షుగర్), అలాగే సోడియం స్థాయిలు గణనీయంగా పడిపోయాయని (తక్కువ సోడియం లెవెల్స్) నిర్ధారించారువైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసీఆర్‌కు నిర్వహించిన మిగిలిన అన్ని వైద్య పరీక్షల నివేదికలు సాధారణంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ, డయాబెటిస్‌ను నియంత్రణలోకి తీసుకురావడానికి.. శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి ఆయనను క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంచి, నిరంతరం చికిత్స అందిస్తున్నారు. ఆయన వయసు, గతంలో ఎదుర్కొన్న తుంటి గాయం వంటి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వైద్యులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, అలాగే సంతోష్ రావు వంటి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లారు.కేసీఆర్ అస్వస్థత వార్త తెలిసిన వెంటనే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు, అధికారులతో ఫోన్లో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి వైద్యులకు సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అంతేకాకుండా.. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు.గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ ప్రజా జీవితంలో అంతగా చురుకుగా కనిపించడం లేదు. ఆయన గతంలో ప్రదర్శించిన దూకుడు, ఉత్సాహం ప్రస్తుతం తగ్గింది. ఇటీవల వరంగల్‌లో జరిగిన పార్టీ బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహాన్ని నింపలేకపోయింది. ఇటీవల జరిగిన పరిణామాలు ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాయి.కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై వస్తున్న తీవ్ర అవినీతి ఆరోపణలు, ప్రాజెక్టులోని కొన్ని భాగాలకు ఇటీవల సంభవించిన నష్టం వంటి అంశాలు ఆయనకు మరింత మానసిక భారాన్ని చేకూర్చాయి. దీనిపై న్యాయ విచారణలు జరుగుతుండటం, ప్రజల్లో దీనిపై పెరిగిన వ్యతిరేకత ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి. గతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరయ్యారు.ఈ పరిణామాలు, అధికారం కోల్పోయిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు, కేసుల భయం, పార్టీని తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, గత ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వస్తున్న విమర్శలు వంటివన్నీ కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలని తన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు.