ఢిల్లీలో ఘనంగా ముగిసిన లాల్‌దర్వాజా బోనాలు
ఢిల్లీలో ఘనంగా ముగిసిన లాల్‌దర్వాజా బోనాలు
ఉత్సవాలకు హాజరయిన హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ
ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ :
దేశరాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో మూడు రోజుల పాటు అత్యంత వైభంగా సాగిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలు బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. లాల్‌దర్వాజా శ్రీ సింహవాని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో 11 సంవత్సరాలుగా బోనాల ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు.దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. రాష్ట్ర రాజధాని అయినటువంటి భాగ్యనగరంలోఅత్యంత వైభవంగా అమ్మవారి బోనాల పండుగను అనేక సంవత్సరాలుగ నిర్వహిస్తున్నారన్నారు. లాల్‌దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాలను ఎపి భవన్, తెలంగాణ భవన్లోను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని గవర్నర్ దత్తాత్రేయ పేర్కొన్నారు. బోనాలు, బతుకమ్మ వంటి పండుగలు తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని వారు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఈ పండుగలో కాళీ దేవిని ఆరాధిస్తారని, హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహిస్తరన్నారు. పండుగ మొదటి, చివరి రోజున దేవి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, బోనాల పండుగ తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉందని, రాజధానిలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అనుసంధానంగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంటువ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు కాళీ దేవికి ప్రార్థనలు చేయడంతో తగ్గుముఖం పట్టాయని, అప్పటి నుంచి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటు వస్తున్నారు. ఈ సందర్బంగా మహాకాళీ అమ్మవారికి ఆయన ‘బంగారు బోనం’ సమర్పించారు. ఈ కార్యక్రమంలో లాల్‌దర్వాజా అలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్, మాజీ చైర్మన్ లు కె. వెంకటేష్, షీరా రాజ్ కుమార్, విష్ణుగౌడ్, తిరుపతి నర్సింగ్ రావు,నర్సింగ్ గౌడ్, నాసా శ్రీనివాస్, చంద్రకుమార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.