నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు : కమల్ హాసన్

నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు : కమల్ హాసన్
ప్రజా క్షేత్ర్, బెంగళూరు, జూన్ 3 :
కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్‌పై వివాదం ముదురుతోన్న వేళ కమల్ హాసన్ తాజాగా స్పందించారు. కమల్ సారీ చెప్పాల్సిందేనంటూ వస్తోన్న డిమాండ్లు, హైకోర్టు కామెంట్స్ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లెటర్ రాశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ రాసుకొచ్చారు.రాజ్ కుమార్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్‌ను అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉందని కమల్ అన్నారు. తమిళం, కన్నడ ప్రజలు ఒకే ఫ్యామిలీ అని చెప్పడమే తన ఉద్దేశమని.. అంతే తప్ప ఏ భాషను తక్కువ చేయడం కాదంటూ లేఖలో పేర్కొన్నారు.ఒక భాష.. మరో భాషపై ఆధిపత్యం చెలాయించడాన్ని తాను వ్యతిరేకిస్తానని.. అన్నీ భాషలకు సమాన గౌరవం కోసం నిలుస్తానని కమల్ లెటర్‌లో పేర్కొన్నారు. 'తమిళంలాగే కన్నడ భాషకు సాంస్కృతిక నేపథ్యం ఉంది. దాన్ని నేను ఆరాధిస్తాను. కన్నడిగుల ఆదరణ నా కెరీర్ మొత్తం ఉంది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. భాష పట్ల నా ప్రేమ నిజమైంది. కన్నడిగులు తమ మాతృభాషను ప్రేమించడాన్ని నేను గౌరవిస్తున్నా. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా అన్నీ భాషలతోనూ నాకు ఎప్పటి నుంచే అనుబంధం ఉంది.నాకు సినిమా భాష తెలుసు. అది యూనివర్సల్ లాంగ్వేజ్. దానికి ప్రేమ, అనుబంధం మాత్రమే తెలుసు. అలా మన మధ్య ఉన్న బంధం గురించే మాట్లాడాను. ఈ ప్రేమ, బంధం గురించి నాకు నా సీనియర్లు చెప్పారు. ఆ ప్రేమ, అభిమానంతోనే శివరాజ్ కుమార్ (శివన్న) ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ పరిణామాలతో ఆయన ఇబ్బందిపడడం విచారకరం. ఏది ఏమైనా మా మధ్య బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సినిమా.. ప్రజల మధ్య వారధిలాంటిది. అశాంతి, శత్రుత్వాన్ని నేను ఎప్పుడూ కోరుకోను.' అంటూ పేర్కొన్నారు.'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ వేడుకలో కమల్.. 'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులతో పాటు కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ సారీ చెప్పాలని.. లేకుంటే 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. కమల్ సైతం ఈ విషయంపై వెనక్కి తగ్గలేదు. 'థగ్ లైఫ్' మూవీని బ్యాన్ చేయాలంటూ కేఎఫ్‌సీసీ తాజాగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేయగా విచారించిన న్యాయస్థానం కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమైనా భాషావేత్తనా?, చరిత్రకారుడా?.. ఒక్క 'సారీ' చెబితే ఇంత దూరం రాదు కదా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ కేఎఫ్‌సీసీకి లేఖ రాశారు. ఎక్కడా సారీ చెప్పకపోయినా.. తన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు.