సవాల్‌ విసిరి తప్పించుకున్నవెందుకు? *సీఎం రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన కేటీఆర్

సవాల్‌ విసిరి తప్పించుకున్నవెందుకు? *సీఎం రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన కేటీఆర్

సవాల్‌ విసిరి తప్పించుకున్నవెందుకు?
*సీఎం రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన కేటీఆర్
*సీఎం రాకుంటే మంత్రులు వచ్చినా చర్చకు సిద్ధం
*ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడైనా రెడీ
*అసెంబ్లీకైనా వస్తం..కానీ మైక్‌ కట్‌ చేయద్దు
*ముఖ్యమంత్రి ఒప్పుకొంటే ఆయన చాలెంజ్‌ను స్వీకరిస్తాం
*బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్‌ జూలై 8  :
‘సీఎం రేవంత్‌రెడ్డి..రైతు సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే తొక ముడిచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయినవెందుకు? అయినా సవాల్‌ విసరడం.. బురదజల్లడం.. పారిపోవడం నీకు మొదటి నుంచి అలవాటే, నువ్వు రాకుంటే నీ మంత్రినైనా పంపు చర్చకు సిద్ధం..’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం రైతు సమస్యలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌కు వెళ్లే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.ముఖ్య మంత్రి ముచ్చటపడితే తాను చర్చకు సిద్ధమయ్యాయని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు సవాల్‌ విసిరి తప్పించుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ‘కొడంగల్‌లో ఒడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేసి ఆరు నెలలు తిరగకముందే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేస్తివి..హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట అంటివి..అందుకే నువ్వు మాట మీద నిలబడే మనిషిని కాదు కాబట్టే నీ కొరిక మేరకు కొడంగల్‌లోనైనా, కొండారెడ్డిపల్లిలోనైనా, నీ జూబ్లీహిల్స్‍ ప్యాలెస్లోనైనా..అంబేద్కర్ చౌరస్తాలోనైనా, చివరికి అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని చెప్పినం.. కాదుపోదూ అంటే తటస్థ వేదిక అయినా ప్రెస్‌క్ల‌బ్‌కు మేమే వస్తమని చెప్పినం.. జూలై 8న 11 గంటలకు రమ్మని అడిగినం..  నువ్వు తప్పించుకపోతవని తెలుసు.. నీకు బేషజాలు తప్పా బేసిన్ల గురించి తెలియదని మూడు రోజుల టైమిచ్చినం.. అంటూ దెప్పిపొడిచారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరించి మొన్ననే ప్రెస్‌క్ల‌బ్‌ను బుక్‌ చేశామని తెలిపారు. ఈ రోజూ సీఎం విసిరిన సవాల్‌ను స్వీకరించి కొడంగల్‌లో రైతుబంధు అందని 670 మంది రైతుల జాబితాతో సహా, రుణమాఫీ కానీ రైతుల వివరాలు, రానీ బోనస్, రైతు శ్రేయస్సుకు సంబంధించిన ప్రతి అంశంపై విస్తారంగా చర్చించేందుకు మా నాయకత్వం మొత్తం రైతు సమస్యలపై అధికారికంగా సమాచారం తీసుకొని ఈ రోజు ప్రెస్‌క్ల‌బ్‌కు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
మంత్రులతోనైనా చర్చకు రెడీ..
ముచ్చటపడి పిలిచిన ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారని తెలిసిందన్నారు. ఒకవేళ ఆయన రాని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రో, వ్యవసాయ శాఖ మంత్రో, బాధ్యాతాయుతమైన మరో మంత్రి వస్తరని అనుకుంటున్నామన్నారు. అందుకే సోమాజిగూడ ప్రెస్క్లబ్‌కు బయల్దేరి వెళ్తున్నారన్నారు. ‘మా కేం భేషజం లేదు.. ముఖ్యమంత్రే రావాలని లేదు.. ఆయన తరుఫున ఉప ముఖ్యమంత్రి వచ్చినా, ఇంకో మంత్రి వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నం.. చర్చించి వివరాలన్నీ అందజేస్తాం’ అని స్పష్టం చేశారు. రైతుల సబ్జెక్టే కాదు.. తెలంగాణ యువత, అశోక్‌నగర్‌లో చాయ్‌ అడ్డామీద రాహుల్‌గాంధీతో చెప్పించిన 2 లక్షల ఉద్యోగాలపై గానీ, ఆడబిడ్డలకు ఇస్తానన్న నెలకు రూ. 2500 హామీలపై తాము చర్చించేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి అన్నారు.. ఆయన చెప్పినట్లు ఆ అంశాలపై చర్చించేందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు.
ఈ రోజు కాకుంటే ఇంకే రోజైనా..
ముఖ్యమంత్రి మాటమీద నిలబడి చర్చకు వస్తే మంచిదన్నారు. ఒకవేళ ఈ రోజు వీలుకాకుంటే మరోరోజైనా తాము వచ్చేందుకు రెడీగా ఉన్నామని కుండబద్ధలుకొట్టారు. మీరు చెప్పిన సమయం, తేదీ నాడే రెడీగా ఉంటామని స్పష్టం చేశారు. ఏనాడు చర్చకు వచ్చినా రైతులకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మరోసారి సవాల్‌ విసురుతున్నామని పేర్కొన్నారు.
అసెంబ్లీలోనైనా చర్చిద్దాం..
మేం ప్రజల సమక్షంలో తటస్థ వేదికపై చర్చిద్దామంటున్నామని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ఒకవేళ అసెంబ్లీలో చర్చ చేసేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. కానీ గతంలో ఫార్మాసిటీ, ఫార్మర్స్‍ సమస్యలు లేవనెత్తిన సందర్భాల్లో అధికారపక్షం తమ మైక్‌ కట్‌ చేయించదని, సీనియర్లు, మాజీ మంత్రులు మాట్లాడినా ఆరేడుసార్లు మైక్‌ కట్‌ చేసిన ఉదంతాలు ఉన్నాయని ఉదహరించారు. అయితే అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం ఏనాడు సుముఖంగా లేదన్నారు. గతంలో ఫార్ములా-ఈపై, ఫార్మర్స్‍ సమస్యలపై, ఫార్మాసిటీపై చర్చకు తాము ప్రతిపాదిస్తే తప్పించుకొన్నదని దుయ్యబట్టారు. అందుకే స్పీకర్‌ను ఇబ్బంది పెట్టవద్దని ఉద్ధేశ్యంతో ప్రెస్‌క్ల‌బ్‌లో చర్చించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో చర్చపెట్టి మైక్‌ కట్‌ చేయకుండా మాట్లాడే సమయం ఇస్తే, ముఖ్యమంత్రి మాటిస్తే చర్చించేందుకు రెడీగా ఉన్నాం..అయితే తమ ప్రతిపాదనలకు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.
చేతగాకుంటే తప్పుకొని కేసీఆర్‌కు అప్పజెప్పు...
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని స్పీకర్‌కు కేసీఆర్‌ లేఖ రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరడం వింతగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ‘మరీ కేసీఆరే అసెంబ్లీ పెట్టమని, కేసీఆరే ముందు చెప్పాలని, అన్ని నిర్ణయాలు ఆయననే చేయమంటే సీఎంగా రేవంత్‌రెడ్డి ఎందుకు? మీరు కదా ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చింది.. అమలు చేయాల్సిన బాధ్యతమీపైలేదా? అని ప్రశ్నించారు. ఒక వేళ పాలన చేయడానికి చేతగాకుంటే తప్పుకొని కేసీఆర్‌కు అప్పగిస్తే అప్పుడు ఏం జేయాలో అది చేసి చూపెడతామని స్పష్టం చేశారు.