ఏజేఎల్ కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారు
ఏజేఎల్ కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపానాలు
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జులై 2 ;: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధమున్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. బుధవారం న్యూఢిల్లీ కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది అదనపు సోలిసిటర్ జనరల్ వి. రాజు తన వాదనలు వినిపించారు. చాలా ఏళ్లుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారన్నారు.అందుకు సంబంధించిన రశీదులను వీరు తయారు చేశారని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతల సూచనల మేరకే ఈ నగదును వీరు ఇలా ఏజేఎల్‌కు బదిలీ చేశారని కోర్టుకు విన్నవించారు. ఇదే తరహాలో.. అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సూచనల మేరకు అడ్వర్టైజ్‌మెంట్ నిధులు సైతం దారి మళ్లించారని వివరించారు. ఇటువంటి మోసపూరిత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం నేరమని ఈడీ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు స్పష్టం చేశారు.ఇక ఈ కేసులో దాతలను సైతం ఈడీ ఇప్పటికే ప్రశ్నించిందని గుర్తు చేశారు. అలాగే సీనియర్ నేతలను సైతం విచారించిందని చెప్పారు. అలాగే షేర్ల బదిలీపై ప్రశ్నించాల్సి ఉందన్నారు. సుమన్ దుబే షేర్లను సోనియా గాంధీకి, ఆస్కార్ ఫెర్నాండేజ్ షేర్లను రాహుల్ గాంధీకి బదిలీ చేశారన్నారు. కానీ ఆ తర్వాత ఈ షేర్లను ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు తిరిగి బదిలీ చేశారని సోదాహరణగా కోర్టుకు ఆయన వివరించారు. ఇవన్నీ నకిలీ లావాదేవీలని న్యాయవాది వి రాజు ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే 2015 వరకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందారని.. వారిద్దరు సోనియా, రాహుల్ గాంధీలు మాత్రమేనని కోర్టుకు న్యాయవాది వి. రాజు తెలిపారు.