గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతి
ప్రజా క్షేత్ర్, పూరీ జూన్ 29 ;:
ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకున్నది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. జగన్నాథుడు, అతని తోబుట్టువులు బలధ్రుడు, సుభద్రా దేవితో కూడిన రథాలు ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకున్నాయి. రథాలను లాగేందుకు, జగన్నాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.ఈ క్రమంలో ఆదివారం ఉదయం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందాచరు. వారిలో ప్రభాతి దాస్, బసంతి సాహూ అనే ఇద్దరు మహిళలు ఉండగా, ప్రేమ్కాంత్ మొహంతి అనే 70 ఏండ్ల వృద్ధుడు ఉన్నారు. వీరంతా ఒడిశాలోని ఖుద్రా జిల్లాకు చెందినవారని, పూరి రథయాత్రను తిలకించేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, భక్తుల రద్దీకి తగిన విధంగా పోలీసులు ఏర్పాట్లు చేయలేదని స్థానిక మీడియా వెల్లడించింది.