జయాబచ్చన్‌పై కంగన రనౌత్ ఫైర్
అమితాబ్ భార్య కాబట్టి ఆమెను సహిస్తున్నారు..
జయాబచ్చన్‌పై కంగన రనౌత్ ఫైర్
ప్రజా క్షేత్ర్, ముంబై ఆగస్టు 13
అలనాటి ప్రముఖ నటి, సమాజ్‌వాది పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ పై బాలీవుడ్ స్టార్ నటి, మండి బీజేపీ ఎంపీ కంగన రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను సహిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిపై జయాబచ్చన్ చిందులు తొక్కారు. అతడిని సీరియస్‌గా పక్కకు తోసేశారు. ‘ఏం చేస్తున్నావు నువ్వు..? ఏంటిది..?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధాని ఢిల్లీ లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆవరణలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోపై కంగన స్పందిస్తూ విమర్శలు చేశారు. జయాబచ్చన్ అత్యంత విశేషాధికారం కలిగిన మహిళ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను అవమానకరంగా, సిగ్గు చేటుగా అభివర్ణించారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.