పాతబస్తీ సుల్తాన్ షాహిలో విషాదం
పాతబస్తీ సుల్తాన్ షాహిలో విషాదం
చేనేత కుటుంబం పై పగబట్టిన విధి
రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే మృతిచెందిన ఇద్దరు అల్లుళ్లు
కూతురి పెళ్ళి ఏర్పాట్లలో ఉండగా ఒక్క సారిగా కుప్పుకూలిన తండ్రి
విధి వంచితకు గురైన కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎంకు రిక్వెస్ట్
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
ఇప్పటికే ఇద్దరు అల్లుళ్లను పోగొట్టుకుని తీరని దు:ఖంలో ఉన్న వృద్దాప్యంలో ఉన్న తల్లికి కుమారుడి మరణవార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కూతురి పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన తండ్రి ఒక్క సారిగా కుప్పకూలి మృతిచెందిన హృదయవిధారక సంఘటన పాతబస్తీ సుల్తాన్ షాహిలో జరిగింది. వివరాలలోకి వెళితే... ముద్దయ్యపేట సరోజిని 34 ఏళ్ల క్రితం తన కుమారుడు రమేష్(47) తో పాటు ఇద్దరు కూతుళ్ళను వెంటబెట్టుకుని చేనేత కుటుంబం భాగ్యనగరానికి బ్రతుకుదెరువు కోసం వచ్చింది. పాతబస్తీ సుల్తాన్ షాహిలో మొగ్గం పనులు చేస్తు కుటుంబాన్ని పోషించుకునే వారు. సరైన పనులు దొరకక రమేష్ చివరికి వంట పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రమేష్ , తన తల్లి సరోజిని తో పాటు కష్టపడి ఇద్దరు సోదరిల వివాహం ఘనంగా జరిపించారు. తాను కూడా రుక్మిణి ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఒక కుమారుడు, కుమార్తె లు ఉన్నారు. అయితే వీరి కుటుంబంపై విధి పగబట్టింది. మొదట పెద్ద సోదరి భర్త ఆరేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తీవ్ర దు:ఖంలో ఉన్న ఆ కుటుంబంపై మరో మారు వెంటాడింది. ఈ సారి చిన్న సోదరి భర్త కూడా నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో ఇద్దరి సోదరిల భర్తలను పోగొట్టుకోవడంతో వారికి కూడా మంచి చెడు చూస్తు ధైర్యం చెప్పసాగాడు రమేష్. తన కూతురుకు వివాహం నిశ్చయం కావడంతో పెళ్ళి ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యాడు. శనివారం మెహదీపట్నంలోని ఓ గణేష్ మండపం వద్ద అన్నప్రసాదం చేయడానికి పనులకు రమేష్ వెళ్ళాడు. అన్నప్రసాదంకు పూర్తిగా సిద్దం చేశాడు. చివరగా పూరి కోసం పిండిని తడుపుతుండగా ఒక్క సారిగా రమేష్ కుప్పకూలాడు. దీంతో వెంటనే మండప నిర్వాహకులు రమేష్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ కు వైద్యులు సిద్దం చేస్తుండగా అంతలోనే రమేష్ కూడా ప్రాణాలొదిలాడు. దీంతో ఆ చేనేత కుటుంబంలో అంతులేని విషాదం నెలకొన్నది. ఇప్పటికే ఇద్దరు అల్లుళ్ళను పోగొట్టుకుని వృద్దాప్యంలో కుమిలి ఏడుస్తున్న తల్లి సరోజినికి కుమారుడు రమేష్ మరణవార్త తీవ్ర దు:ఖాన్ని మిగిల్చింది. ఇంకా మాకుటుంబానికి దిక్కెవరు అని ఏడుస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కాగా విధి వంచితగా గురైన చేనేత కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.