మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

 కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారన్నారు. కేవలం తన గౌరవానికి ఈ ఇమేజ్‌కి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ కొండ సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు.  కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయ్యిండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరం అన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్,ఇతర అంశాల పైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయ్యాయన్నారు. ఎలాంటి సాక్షాదారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండ సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడేఅవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ సంవత్సరం నాలుగవ నెలలో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక ఒక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నరన్నారు. కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్దాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తుందన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. దీంతోపాటు అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించారు.