రైతుభరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు
రైతుభరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు
ప్రజా క్షేత్ర్, మెదక్ , జూన్ 25 :
రైతు భరోసా కుటుంబంలో చిచ్చు పెట్టింది. ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు తనకు ఇవ్వలేదని కుమారుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి నాలుక కోసేశాడు. ఈ దుర్ఘటన మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం
ఔరంగాబాద్ తండాలో జరిగింది. తండాలో బానోత్ కీర్యా అనే రైతుకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి. ఎకరా భూమి ఉన్నందున ప్రభుత్వం తరఫున రూ.6000 అకౌంట్లో జమ అయ్యాయి. ఈ డబ్బుల విషయంలో కుటుంబంలో వివాదం తలెత్తింది. తనకు ఈ డబ్బులు ఇవ్వాలని చిన్న కుమారుడు సంతోష్ అడిగాడు. ఇంతలో ఆరోగ్యం బాగాలేదని రెండు వేల రూపాయలను తండ్రి ఖర్చుపెట్టేశాడు. తండ్రి 2 వేల రూపాయలు ఖర్చు పెట్టేయడంపై చిన్న కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను డబ్బులు అడిగితే ఎందుకు ఖర్చు చేశావని గొడవ పడ్డాడు. కోపంతో తండ్రిపై దాడి చేశాడు. అక్కడితో ఆగిపోకుండా తండ్రి తిరిగి సమాధానం చెబుతున్నాడని గొడ్డలితో నాలుక కోసేశాడు. స్థానికులు కీర్యాను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్న కుమారుడు ఇలా తన భర్తపై దాడి చేసి నాలుక కోశాడని కీర్యా భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.