గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మకు తొలి బంగారు బోనం
గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మకు తొలి బంగారు బోనం
సమర్పించిన భాగ్యనగర్ ఉమ్మడి ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి ఆదివారం తొలి బంగారు బోనం సమర్పించారు. బ్యాండు చప్పుళ్ళు ...పోతరాజుల వీరంగాల నడుమ... శివసత్తుల నడుమ నిషా క్రాంతి బంగారు బోన మెత్తుకుని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బయలుదేరారు. అంతకుముందు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ఉమ్మడిదేవాలయాల ఉరేగింపు కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిబౌలి మండి నుంచి గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రతినిధులను ఆలయ కమిటీ ఘనంగా శాలువలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్, వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు గాజులఅంజయ్య, రాకేష్ తివారి, పొటేల్ సదానంద్ యాదవ్, జనగామ మధుసూధన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.