తెలంగాణ డీఎస్సీ ‌‌2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ డీఎస్సీ ‌‌2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ డీఎస్సీ ‌‌2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

ప్రజా ప్రభుత్వం రికార్డు సమయంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ #DSC-2024 ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. దసర పండుగ శుభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 9 వ తేదీన నియామకపు పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. డా.బీఆర్ అబేంద్కర్ సచివాలయంలో డీఎస్సీ ఫలితాల విడుదల అనంతరం ముఖ్యమంత్రి విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012 లో ఒకసారి, తెలంగాణ ఏర్పడిన తర్వాత గడిచిన పదేళ్లలో 2017 లో ఒకే ఒక్కసారి అదికూడా కేవలం 7,857 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 30 వేల పోస్టులను భర్తీ చేశాం. వ్యవస్థలను నిర్వీర్యం చేసి అంగడిగా మార్చిన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం.  ప్రస్తుత టీచర్ల నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీల ఆధారంగా కొత్త నియామక ప్రక్రియ చేపడుతాం. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు నిరంతర ప్రక్రియగా సాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంగా పాఠశాలలు మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. విద్యపై ఖర్చును భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తాం. గడిచిన పదేళ్లలో విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యకు నిధులు పెంచాం. ఇంకా పెంచుతాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వంటి గురుకులాలు ప్రారంభించారు గానీ వాటిలో కనీస సౌకర్యాలు కల్పించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే సామాజిక సమతుల్యత పాటిస్తూ రాష్ట్రంలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తాం.  ఒక్కో నియోజకవర్గంలో 100 -120 కోట్ల రూపాయల నిధులతో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో సంపూర్ణమైన వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల క్యాంపస్ లను ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగానే కొడంగల్, మధిరల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టాం. బదిలీలు, ప్రమోషన్లు లేక నిరాశా నిస్పృహలతో ఉన్న టీచర్లకు సంబంధించి 34,706 మందికి ఎలాంటి అవాంతరాలు, ఆరోపణలు లేకుండా ఆ ప్రక్రియను చేశాం.  విద్య, నీళ్లు, నియామకాలు వంటివి భావోద్వేగంతో కూడినవి. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటిస్తాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 60 నుంచి 65 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నది లక్ష్యం.  గత జూలై 18 నుంచి ఆగస్టు 5 వ తేదీ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను 55 రోజుల రికార్డు సమయంలో ప్రకటించడం పట్ల విద్యా శాఖ అధికారులకు అభినందనలు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.