మూడేండ్లలో మళ్ళీ కేసీఆరే తెలంగాణ ముఖ్యమంత్రి : కేటీ ఆర్
ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నాం
* మూడేండ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు
* మిమ్మల్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తున్నది.
* ఖండాలను దాటి తెలంగాణ నైపుణ్యాన్ని చాటిన మీ అందరికీ వందనం.
* పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మను మరచిపోలేదు.
* బతుకును ఇచ్చిన తెలంగాణను మీరు మరచిపోలేదు.
* అమెరికాలోని డాలస్ నగరంలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలలలో కేటిఅర్
ప్రజా క్షేత్ర్, డాలస్, జూన్ 2 :
నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్.. ఒకే ఒక్కడిగా బయల్దేరారని, ఎన్నో అవమానాలను అధిగమించి తెలంగాణను సాధించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే.. దశాబ్దాలుగా కొట్లాడితే తెలంగాణ వచ్చిందని చెప్పారు. పోరాడి సాధించిన యోధుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో అదే కసి.. స్ఫూర్తితో పనిచేశామన్నారు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నామని చెప్పారు. మూడేండ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని వెల్లడించారు. అమెరికాలోని డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు, బీఆర్‌ఎస్ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఎన్నారైలు పెద్దసంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ.. ‘ మిమ్మల్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తున్నది. ఖండాలను దాటి తెలంగాణ నైపుణ్యాన్ని చాటిన మీ అందరికీ వందనం. తెలంగాణకు ప్రతీకగా నిలిచిన మీ అందరికీ అభివందనం. అమెరికాలోని తెలంగాణవాసులను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నది. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మను మరచిపోలేదు. బతుకును ఇచ్చిన తెలంగాణను మీరు మరచిపోలేదు. దశాబ్ద కాలంగా ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఇప్పుడూ అలాగే కనబడుతున్నది. నిన్నటి వరకు తెలుగు వారికి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నా.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్‌లో ఉందని.
అమెరికాలో ఉన్నట్లు ఎంతమాత్రం అనిపించడం లేదు. 2015లో పెట్టుబడుల కోసం అమెరికాలో తిరుగుతూ డాలస్‌కు వచ్చాం. పదేండ్ల తర్వాత ఇక్కడకు వచ్చి చూస్తే కేసీఆర్ దూతలుగా ఎన్నో చేసి చూపించారు. జీవితంలో ఎన్నో కలలు కంటారు. కొందరు వాటిని సాకారం చేసుకుంటారు. 2001లో నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్ తెలంగాణ కలగన్నారు. ఒకే ఒక్కడిగా బయల్దేరారు. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్డండన్నారు. శూన్యం నుంచి బయల్దేరి అందరినీ ఏకం చేసి తెలంగాణను సాధించారు. విదేశీ గడ్డపైనా జై తెలంగాణ అని నినదించారు. ఎన్నో అవమానాలను అధిగమించి తెంగాణను సాధించారు. మేం బాధ్యతగా భావించడంతోనే అనితర సాధ్యమైన విజయాలు చేకూరాయి. స్వరాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలుపుకోవడంలో ఏ అవకాశాన్ని వదులుకోలేదు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నాం. మళ్లీ మూడేండ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు చేరుతుంది. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే.. దశాబ్దాలుగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. పోరాడి సాధించిన యోధుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో అదే కసి.. స్ఫూర్తితో పనిచేశామని చెప్పుకొచ్చారు..