వైభవంగా ఢిల్లీలో మాతేశ్వరి అమ్మవారి ఘటాల ఊరేగింపు
వైభవంగా ఢిల్లీలో మాతేశ్వరి అమ్మవారి ఘటాల ఊరేగింపు
ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు వైభవంగా సాగిన అమ్మవారి బోనాల జాతర
హాజరయిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో మూడు రోజుల పాటు జరిగే లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్, మాజీ చైర్మన్ కె. వెంకటేష్ ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం 11వ వార్షిక బోనాల ఉత్సవాలను, ఫోటో ఎగ్జిబిషన్ ను ఇప్పటికేతెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ప్రారంభిచారు. మంగళవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద లాల్ దర్వాజా మాతేశ్వరి అమ్మవారి ఘటాల ఊరేగింపు ను తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు... పోతరాజుల వీరంగం... 150 మంది కళాకారుల నృత్యాల నడుమ ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటాల ఊరేగింపు జాతర వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు మారుతీ యాదవ్, మాజీ చైర్మన్ లు సి. వెంకటేష్, ఎ. మాణిక్ ప్రభు గౌడ్, కె. వెంకటేష్, షీరా రాజ్ కుమార్, విష్ణు గౌడ్, బల్వంత్ యాదవ్, ప్రతినిధులు సతీష్ ముదిరాజ్, శేషు నారాయణ, చంద్రకుమార్, నర్సింగ్ గౌడ్, పొన్న వెంకట రమణ, విఠల్ తదితరులు పాల్గొన్నారు.