స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి : మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి : మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి
మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం...అవి అసెంబ్లీ అయినా కావొచ్చు, పార్లమెంట్ అయినా కావొచ్చు, స్థానిక సంస్థలైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలైనా కావొచ్చు. ప్రతి స్థాయిలో ఈ ఎన్నికలు సమయానికి అనుగుణంగా జరగాలని భువనగిరి మాజీ ఎంపి డా బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కాని..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడిచినా, ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత లేదు.  రాష్ట్రంలో 12,769 మంది సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసింది.   రాష్ట్రవ్యాప్తంగా 5,717 మంది ఎంపీటీసీల పదవీకాలం 2024 మే నెలలో ముగిసింది. ఇప్పటికీ ఈ స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 538 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్ పర్సన్ల పదవీకాలం కూడా పూర్తయ్యి సంవత్సరం దాటిపోయింది. రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలలో 128 మున్సిపాలిటీల పదవీకాలం పూర్తై ఆరు నెలలు గడిచింది. అయినా ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-A, 243-U, 243-ZA పరిధిలో ఉన్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి లోకల్ బాడీలకు అభివృద్ధి నిధులు ప్రధానంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావలసిన రూ. 1514 కోట్లు నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రజలు ఈ నష్టాన్ని భరించాల్సి వస్తోంది. అంతేకాక, గతంలో 14వ ఆర్థిక సంఘం కింద రావలసిన రూ. 800 కోట్ల బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా ఎన్నికల నిర్వహణ లేకపోవడం వల్ల విడుదల కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోందని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఎన్నికల్లో రిజర్వేషన్ నిష్పత్తి నిర్ణయించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ ప్రక్రియను అమలు చేస్తుంది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఎలా ఉండాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వడంలో విఫలమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గొప్పగా మాటలు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. కానీ ఆ హామీలు ఎటూ తీరకపోవడం, ఎన్నికలు జరగకపోవడం వల్ల అభివృద్ధి నిధులు నిలిచిపోవడం.. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను చూపిస్తున్నాయి. అందువల్ల తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, రాష్ట్రం నష్టపోకుండా చూడాలని అన్నారు. ఆర్టికల్ 243 (U), 243 (Z), 243 (A) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హక్కు, బాధ్యత. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆ నిధులు పూర్తిగా వినియోగం కావడం లేదు.
రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎంత ఉండాలో నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నది ఇంకా అమలు రూపం దాల్చలేదు. బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే ‘ట్రిపుల్ టెస్ట్’ ప్రకారం — (1) కులగణన, (2) బీసీ కమిషన్, (3) డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలంప్రకటనలు చేసి, పబ్లిక్కు వివరాలు మాత్రం వెల్లడించలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టాలని చూడటం తప్పుదారి పట్టించే చర్య అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో బీసీ కులాల గణాంకాలను ప్రచురించాలని, రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో, ప్రతి రోజూ ఒక మంత్రి “ఇప్పుడు జరుగుతాయి”, “తొందర్లో ఉంటాయి”, “సంక్రాంతికి జరుగుతాయి” వంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.