అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ భారీ ర్యాలీ

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ భారీ ర్యాలీ

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం:
పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో ర్యాలీ
ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
 అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని  ప్రపంచ మాదకద్రవ్యాల దినోత్సవం పురస్కరించుకుని, కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించగా, కరీంనగర్ కలెక్టరేట్ నుండి ప్రారంభమై, ప్రతిమ మల్టీప్లెక్స్ జంక్షన్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా ఉన్నత అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్లు, పోలీసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ. ముఖ్యంగా యువత విద్యార్థులలో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, పోరాడటానికి ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాలు, ప్రజాభాగస్వామ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 20, 2025 నుండి జూన్ 26, 2025 వరకు అవగాహన వారం నిర్వహిస్తున్నందున, కరీంనగర్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన ప్రచారం మరియు కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. కమీషనర్ తమ ప్రసంగంలో విద్యార్థి దశలో వివిధ కారణాల వల్ల ఒత్తిడికి లోనై, చెడు స్నేహాల వలన మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మానసికంగా, శారీరకంగా తీవ్రంగా నష్టపోతారని, కొన్ని సందర్భాల్లో జీవితాలను సైతం కోల్పోతారని తెలిపారు. దీని నిర్మూలనకు విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యులై, డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మరియు అధికారులంతా ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ ఏఎస్పీ శుభం ప్రకాష్ ఐపీఎస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీలు వెంకటస్వామి టౌన్, విజయ్ కుమార్ సీసీఆర్బి, ఇన్స్పెక్టర్లు,  తదితరులు పాల్గొన్నారు.