అట్టహాసంగా ప్రారంభమయిన లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు
అట్టహాసంగా ప్రారంభమయిన లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు
తొలిరోజు అమ్మవారికి అభిషేకం, శిఖరపూజ, ధ్వజారోహణ, కలశస్థాపన
లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్
ప్రజా క్షేత్ర్, చార్మినార్ , జూలై :
తెలంగాణలో ప్రసిద్దిచెందిన లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్చారణలతో మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో చారిత్రాత్మక నేపధ్యం కలిగిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళిదేవాలయం, బంగారుమైసమ్మదేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళిదేవాలయం, సుల్తాన్షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేళా ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా కోటమైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ కనకదుర్గ ఆలయం, దేవి దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, మేకల్బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయాలలో శిఖరపూజ, ధ్వజా రోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు.
లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ ....
ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా లాల్‌దర్వాజా శ్రీసింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా, జీహెచ్ఎంసి చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నలతో కలిసి 117 వ బోనాల వార్షికోత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీయాదవ్, కన్వీనర్ జి.అరవింద్‌కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు పోసాని సతీష్ ముదిరాజ్, బి.అమర్నాథ్ యాదవ్‌లు ఆలయానికి విచ్చేసిన కమిషనర్లకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీయాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం శిఖరపూజ, ధ్వజా రోహణంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల బ్రౌచర్ ను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ లు ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటి తరపున మాజీ చైర్మన్ మాణిక్‌ప్రభు గౌడ్ కుటుంబం తొలి బోనం సమర్పించింది.
బోనాలను శాంతియుతంగా జరుపుకోవాలి....-సీపీ సివి ఆనంద్
బోనాల ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం నగర పోలీస్ కమినర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఎంతో విశిష్టత కలిగిన లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు నిజాం కాలం నుండి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ ను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తన చేతులమీదుగా బోనాల ఉత్సవాలు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. బోనాల ఉత్సవాలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు. లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలతో పాటు పాతబస్తీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకుగాను పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రజలు, భక్తులు పోలీసులకు, ఆలయల కమిటీ ప్రతినిధులకు సహకరించాలని కోరారు.
పారిశుద్ద్యం పై ప్రత్యేక దృష్టి సారించాము ... -జి హెచ్ ఎం సి కమిషనర్ ఆర్.వి.కర్ణన్
ఎంతో విశిష్ట గల లాల్ దర్వాజ మహంకాళి బోనాలు ఉత్సవాలను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో అనందంగా ఉందన్నారు.బోనాల ఉత్సవాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.అభివృద్ధి పనులను పండుగ లోవు పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి డీసీపీ అపూర్వ రావు, ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్, ఛత్రినాక ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, శాలిబండ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, మొఘల్‌పురా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీచైర్మన్లు కె.వెంకటేష్, జె.లక్ష్మీనారాయణ గౌడ్, ఎ.మాణిక్ ప్రభు గౌడ్, జి.రాజ్‌కుమార్ యాదవ్, సీర రాజ్‌కుమార్, కె.విష్ణు గౌడ్,తిరుపతి నర్సింగ్ రావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎ.చంద్రకుమార్, ఎ.వినోద్ కుమార్, శేషునారాయణ, జి. హరీష్‌గౌడ్,. ఎ.యశ్వంత్ గౌడ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.