కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, సెప్టెంబర్ 2 :
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ లో వీరికి స్వల్ప ఊరట లభించింది.
హైకోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అప్పటివరకూ (తదుపరి విచారణ తేదీ వరకు) వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఏజీ తెలిపారు. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు, సీబీఐ దర్యాప్తునకు ఏ సంబంధం లేదని కోర్టుకు ఏజీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులు అవకతవకలు జరిగాయని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కేసును సీబీఐకి అప్పగించాలని ఆదివారం అర్ధరాత్రి శాసనసభలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు లేఖ సైతం రాశారు. అయితే సీబీఐకి కాళేశ్వరం కేసు దర్యాప్తును అప్పగించడంతో కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఏమాత్రం ప్రామాణికత లేని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారని, సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలని తమ పిటిషన్లో కోరారు. సోమవారం అత్యవసరంగా పిటిషన్ విచారణకు రాగా, విచారణను మంగళవారానికి (సెప్టెంబర్ 2కు) హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా కోర్టు అందుకు నిరాకరించింది.ఈ క్రమంలో హైకోర్టు మంగళవారం నాడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు విచారించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదికి వాయిదా వేసింది. కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. కాళేశ్వరంపై దర్యాప్తు కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని అడ్వకేట్
జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ దర్యాప్తునకు, కాళేశ్వరం రిపోర్టుకు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి బ్రేకులు పడ్డాయి.కేసు తదుపరి విచారణ అక్టోబర్ 7న కనుక అప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న హైకోర్టు ఆదేశాలు పాటించాల్సి ఉంటుందని కేసీఆర్, హరీష్ రావు తరపున వాదనలు వినిపించిన లాయర్ అన్నారు. కమిషన్ రిపోర్టునే పరిగణనలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అలాంటప్పుడు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టే అవకాశం ప్రస్తుతానికి లేదన్నారు.