*నేడు లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు*
*నేడు లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు*
*ముస్తాబయిన అమ్మవారి ఆలయాలు*
*ఆకట్టుకుంటున్న డిజిటల్ స్వాగత తోరణాలు*
*భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు*
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా జరిగే పాతనగర బోనాల ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు, పురవీధులను శోభాయమానంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. భారీ ఎత్తున జరిగే ఆషాడమాసం బోనాల ఉత్సవాలకు పాతనగరం ముస్తాబయ్యింది. లాల్దర్వాజామోడ్, ఛత్రినాక, గౌలిపురా, లాల్‌దర్వాజా, ఫూల్ బాగ్ లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్వాగత వేదికలు పలువురిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాతనగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. తొమ్మిది రోజులుగా ప్రజలు భక్తి పారవశ్యంలోమునిగిపోయారు. లక్షలాదిమందిమహిళా భక్తులు సంప్రదాయదుస్తులు ధరించి నెత్తిన బోనాలు ఎత్తుకుని శివసత్తులు, పోతరాజుల నృత్యం నడుమ ఆలయాలలో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.
*ముస్తాబయిన అమ్మవారి ఆలయాలు* ...
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం, హరిబౌళి శ్రీఅక్కన్నమాదన్న దేవాలయం, బంగారుమైసమ్మ దేవాలయం, చందులాల్ బేలా ముత్యాలమ్మదేవాలయం,సుల్తాన్షాహి శ్రీ జగదాంబ దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం, గౌలిపురా మాతేశ్వరి దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళి దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ దేవి దేవాలయం, కుమ్మర్వాడి శ్రీ కనకదుర్గ దేవాలయం, మురాద్‌మహల్ శ్రీ మహంకాళి దేవాలయం, రాంభక్షీబండ శ్రీ బంగారుమైసమ్మ దేవాలయం, మేకల్ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం, ఆలీజాకోట్ల కోటమైసమ్మ దేవాలయాలను ఆలయ పరిసరాలను పూలతో అందంగా ముస్తాబు చేశారు. క్యూ పద్దతిలో అమ్మవారిని దర్శించేందుకు వీలుగా ఆలయ పరిసర ప్రాంతాలలో బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర సమాచారాల, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
*గట్టి పోలీస్ బందోబస్తు*....
ఆదివారం జరిగే పాతనగర బోనాల ఉత్సవాలలో పాల్గొనడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీనటులతో పాటు లక్షలాధి మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణమండలం డిసిపి స్నేహ మెహ్ర ఆధ్వర్యంలో ఛత్రినాక, షాలిబండా, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్లు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాతనగర బోనాలలో 3వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.